ENGLISH

‘మత్తు’కి బానిసలెవరు.. ‘మత్తు’గా బిజినెస్‌ చేస్తున్నదెవరు?

12 September 2020-17:30 PM

డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నవారు వేరు.. ఆ మత్తులోకి దించేవారు వేరు. బాలీవుడ్‌లో కదిలిన డ్రగ్స్‌ డొంక.. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమల్నీ ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా టాలీవుడ్‌కి పాకింది ఈ డ్రగ్స్‌ వివాదం. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరుని రియా చక్రవర్తి తన వాంగ్మూలంలో పేర్కొందంటూ నేషనల్‌ మీడియా కోడై కూసేస్తున్న వేళ ఎప్పుడు ఎవరి వికెట్‌ పడిపోతుందో తెలియక అన్ని సినీ పరిశ్రమలూ గజగజలాడుతున్నాయి. అయితే, కొందరు తెలియక మత్తుకి బానిసలై వుండొచ్చనీ.. అలాంటి వారికంటే, ‘తెలిసీ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నవారు’ మాత్రం కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీస్‌ ఉన్నతాధికారులు మొదటి నుంచీ చెబుతున్నారు.

 

కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్‌ డొంక కదిలింది. అప్పట్లో కొందరు ‘డ్రగ్స్‌ బానిసలు’ అనే ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, ‘డ్రగ్స్‌ బిజినెస్‌ చేస్తున్నారు’ అనే విమర్శ ఎవరి మీదా రాలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. రియా చక్రవర్తి, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ కోసం డ్రగ్స్‌ తీసుకొచ్చిందనీ, ఇందుకోసం తన సోదరుడు షోవిక్‌ సహకారం తీసుకుందని నార్కోటిక్స్‌ బ్యూరో తేల్చింది. ఆ లెక్కన ఈ తరహా కేసుల్లో ఎంతమంది ఇరుక్కుంటారో ఇప్పుడే చెప్పలేం. రియా అరెస్ట్‌ వెనుక బలమైన ఆధారాలున్నాయన్నది ఎన్సీబీ వాదన.

 

న్యాయస్థానం రియాకి బెయిల్‌ నిరాకరించడానికి కారణం కూడా ఇదేనట. దాంతో, తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలోనూ ఆందోళన నెలకొంది. ఓ దర్శకుడు, కొందరు హీరోయిన్లు, ఒకరిద్దరు యంగ్‌ హీరోలు, కొందరు నిర్మాతలు కూడా ఈ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుపోవడం ఖాయమంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ALSO READ: చిరంజీవి ‘గుండు’ వెనుక అంత ‘కథ’ వుందా.?