ENGLISH

ఆమెకి 'పైసావసూల్‌' అయ్యనా?

21 August 2017-11:23 AM

'పైసావసూల్‌' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్‌లో 'పూరి కనెక్ట్స్‌' తరఫున ఛార్మినే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా నిర్మాణ పర్యవేక్షణ అంతా పూర్తిగా ఛార్మి కనుసన్నల్లోనే జరుగుతోంది. బాలకృష్ణతో గతంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించిన చార్మి, 'పైసావసూల్‌'తో కొత్త పాత్రలోకి ఒదిగిపోయింది. చాలాకాలంగా సినిమా నిర్మాణంపై దృష్టిపెట్టిన ఛార్మి, సినిమాకి సంబంధించి వివిధ విభాగాల పనితీరుని మరింత జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిర్మాతగా మారాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలియవస్తోంది. 'పైసావసూల్‌' తర్వాత ఛార్మి పూర్తిస్థాయి నిర్మాతగా మారుతుందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ - ఛార్మి సంయుక్తంగా ఇకపై సినిమాలు నిర్మిస్తారట. పెద్ద సినిమాల్ని ఇంకో నిర్మాత భాగస్వామ్యంతో, చిన్న సినిమాల్ని పూరి కనెక్ట్స్‌ మీద నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారమ్‌. 'పైసావసూల్‌' సినిమా ఫలితం తర్వాత ఈ అంశాలపై క్లారిటీ ఇస్తూ పూరి జగన్నాథ్‌, ఛార్మి ఓ ప్రకటన చేయున్నారని సినీ వర్గాల్లో టాక్‌ వినవస్తోంది. అయితే ఇంతవరకు ఈ విషయంపై పూరి, ఛార్మి ఎలాంటి సంకేతాలు పంపలేదు. అయితే పూరి కనెక్ట్స్‌ ద్వారా నటీనటుల్ని 'ఇంపోర్ట్‌' చేయడం వంటి కార్యకలాపాలే ఇప్పటిదాకా చేపట్టారు. 'పైసావసూల్‌' పోస్టర్లలో 'పిసి' (పూరి కనెక్ట్స్‌) చాంతాడంత అక్షరాలతో కనిపిస్తుండడం గమనించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.

ALSO READ: నవదీప్ కి ఎన్టీఆర్ ఝలక్