ENGLISH

తమన్ యాక్షన్ కి చిరు రియాక్షన్

18 January 2025-12:04 PM

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాల్లో రెండిటికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావటం గమనార్హం. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ ఈ రెండూ తమన్ కి మంచి పేరు తెచ్చాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రెండూ సినిమాలకి ప్లస్ అయ్యింది. తనకి వరుస హిట్స్ ఇవ్వటంతో నందమూరి తమన్ అని కీర్తించాడు బాలయ్య. తాజాగా ఒక వేదికపై గేమ్ చేంజర్ సినిమా పై తమన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

రామ్ చరణ్- శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ బాగున్నా కావాలని కొందరు నెగిటీవ్ టాక్ తెచ్చారని మండి పడ్డాడు తమన్. దీని వెనక రాజకీయ కుట్ర కోణం ఉందని పలువురి అభిప్రాయం. రాజకీయ కక్షల నేపథ్యంలోనే HD ప్రింట్ పైరసీ చేసి, లోకల్ టీవీ, ప్రయివేటు బస్ లలో వేశారని మెగా ఫాన్స్ వాదన. కావాలని నెగెటీవిటి తెచ్చి ప్లాఫ్ ముద్ర వేశారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో బాధపడ్డారు.

తాజాగా డాకు మహారాజ్ విజయోత్సవ సభలో తమన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గేమ్ చేంజర్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా  'మన సినిమాను మనమే చంపుకుంటున్నామని, ఏం బతుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు. ఓపెన్ గా ఒక సినిమా సక్సెస్ గురించి ఇంకొకరు  చెప్పలేకపోతున్నారు. ఇదొక దురదృష్ట ఘటన, మన సినిమా గురించి మనం చెప్పుకోవాలి కదా. సినిమా చాలా గొప్పది. వ్యక్తిగతంగా మీరు కొట్టుకు చావండి. కానీ, సినిమాను చంపకండి. అది కరెక్ట్ కాదు. ఇక ఏ సినిమాకు అలా జరగకూడదు అని కోరుకుంటున్నట్లు' తెలిపాడు తమన్.

తమన్ మాటలకి మెగాస్టార్ స్పందిస్తూ 'నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, కానీ అవి చాలా ప్రభావితం చేస్తాయి, కొన్ని సార్లు అవి మనల్ని బాధిస్తాయి అని పేర్కొంటూ, తమన్ ని కీర్తించారు చిరు.

ALSO READ: మంచు విష్ణు, మనోజ్ ట్విట్టర్ వార్