నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ, మాళవికా సతీశన్ తదితరులు
దర్శకత్వం : శేష్ సింధూ రావ్
నిర్మాతలు : రాజ్ కందుకూరి
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫర్ : వేదరామన్
ఎడిటర్: రవి తేజ గిరిజాల
రేటింగ్: 3/5
అభిరుచి గల నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో లాంటి సినిమాలు ఆయన్నుంచి వచ్చినవే. చాలామంది కొత్తవారికి జీవితాన్ని ఇచ్చారు. వాళ్లకో మార్గం చూపించారు. ఇప్పుడు తన తనయుడినే హీరోగా పరిచయం చేశారు. అదే.. `చూసీ చూడంగానే`. అటవాటు ప్రకారం శేష సింధుని దర్శకురాలిగా పరిచయం చేశారు. మరి చాలా మందికి విజయాన్ని పరిచయం చేసిన రాజ్ కందుకూరి తనయుడికి ఎలాంటి సినిమా ఇచ్చారు? ఇందులో చూడగానే నచ్చే విషయాలు ఏమున్నాయి?
*కథ
సిద్దూ (శివ) ఇంజనీరింగ్ విద్యార్థి. తనకు అసలు ఇంజనీరింగ్ చదవడం ఇష్టం ఉండదు. అమ్మ (పవిత్ర లోకేష్) బలవంతం మీద కాలేజీలో అడుగుపెడతాడు. తన దృష్టంతా ఫొటోగ్రఫీ పై ఉంటుంది. కాలేజీలో తొలి చూపులోనే ఐశ్వర్య (మాళవిక)ని ఇష్టపడతాడు. ఐశ్వర్య కూడా సిద్దూని ప్రేమిస్తుంది. నాలుగేళ్ల పాటు వీళ్ల ప్రేమకథ హాయిగా సాగిపోతుంది. అయితే అనుకోకుండా ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఐశ్వర్య ఆలోచనల నుంచి బయటకొచ్చి, ఓ ఈవెంట్ ఫొటోగ్రాఫర్ గా సెటిల్ అవుతాడు సిద్దూ.
ఇంతలో తన జీవితంలోకి శ్రుతి (వర్ష) అనే మరో అమ్మాయి వస్తుంది. తనో డ్రమ్మర్. ఓ బ్యాండ్‌తో కలిసి పనిచేస్తుంటుంది. తనకు సంగీత దర్శకురాలు కావాలని ఆశ. శ్రుతిని కూడా తొలి చూపులోనే ఇష్టపడతాడు సిద్దూ. తన ప్రేమని శ్రుతికి చెప్పాలనుకునేలోగా.. ఆమెకు సంబంధించి ఓ నిజం తెలుస్తుంది. అదేంటి? అది తెలుసుకుని సిద్దూ ఏం చేశాడు? ఐశ్వర్య - సిద్దూ ఎందుకు విడిపోయారు? శ్రుతితో ప్రేమకథ ఎక్కడి వరకూ వెళ్లింది? ఈ విషయాలన్నీ ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
*విశ్లేషణ
పెళ్లి చూపులు, మెంటల్ మదిలో.. ఇవేమీ కొత్త కథలు కావు. మామూలు కథలే. కానీ వాటి ట్రీట్‌మెంట్ విభిన్నంగా ఉంటుంది. సహజత్వం ఈ సినిమాల ప్రధాన బలం. ఇప్పుడు `చూసీ చూడంగానే` కూడా దాన్నే నమ్ముకుంది. శేష సింధు రాసుకున్న కథలో కొత్తదనం లేదు. కాకపోతే.. తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా సహజంగా, అందంగా, ఎలాంటి అసభ్యతకూ చోటు ఇవ్వకుండా చెప్పే ప్రయత్నం చేసింది. కథానాయకుడు, నాయికల పరిచయ సన్నివేశాలు, కథలోకి తీసుకెళ్లే విధానం.. ఇవన్నీ హాయిగా సాగిపోతాయి. కాలేజీ కథలు అనగానే ఈ మధ్య కాస్త భయం వేస్తున్నాయి. లిప్ లాక్కులు, వేడి పుట్టించే సన్నివేశాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కథలో వాటికి చోటు లేదు. ఎలాంటి సన్నివేశాన్నయినా పొయెటిక్‌గా చెప్పాలని చూడడం అభినందించదగిన విషయం.
విశ్రాంతి ముందు కథలో చిన్న మలుపు. అది ఆసక్తిని రేకెత్తించేదే. శ్రుతి ఫ్లాష్ బ్యాక్ తెలిశాక... ఆ పాత్రపై తప్పకుండా ప్రేక్షకులకు ప్రేమ పెరుగుతుంది. సిద్దూ - శ్రుతి కలిస్తే బాగుండేది అనిపిస్తుంది. ద్వితీయార్థం కథ మరీ పరుగులు పెట్టదు గానీ, ఎక్కడా బోర్ లేకుండా సాగిపోతుంది. ఈ చిత్రానికి దర్శకురాలు ఓ మహిళ. మాటలు రాసింది కూడా మహిళే. సో.. అమ్మాయిల మనస్తత్వాల్ని వాళ్లు బాగా అర్థం చేసుకున్నారనిపిస్తుంది. వాళ్ల లోలోతులు తెలుసు కాబట్టి, వాళ్లకు నచ్చేలా మాటలు, సన్నివేశాలు రాసుకోగలిగారు. ప్రతీ ప్రేమలోనూ కోపతాపాలు, అలకలు, మనస్పర్థలూ ఉంటాయి. వాటిని దాటుకుని ప్రేమ నిలుస్తుంది. గెలుస్తుంది. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కథని ఎంత హాయిగా ప్రారంభించారో, అంతే హాయిగా ముగించారు. అక్కడక్కడ చూసిన సన్నివేశమే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ వచ్చినా, మొత్తానికి మనసుని హత్తుకునేలా ఈ చిత్రాన్ని తీయగలిగారు.
*నటీనటులు
కథానాయకుడు శివకు ఇదే తొలి చిత్రం. అయినా ఎక్కడా తడబాటు లేకుండా నటించేశాడు. చూడగానే నచ్చే లుక్స్ ఉన్నాయి. పక్కింటి అబ్బాయి పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా సూటవుతాడు. తన కాస్ట్యూమ్స్ కూడా కూల్‌గా ఉన్నాయి. ఐశ్వర్యగా మాళవిక ది అంత ప్రాధాన్యం లేని పాత్రే అయినా చూడ్డానికి తాను ముద్దుగా ఉంది.
కథానాయికల్లో వర్షకే ఎక్కువ ఛాన్స్ దొరికింది. మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తూనే, తనలో ఎనలేని ప్రేమ దాచుకున్న ప్రేమికురాలిగా మెప్పించింది. పవిత్రా లోకేష్‌తో సహా, మిగిలినవాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
*సాంకేతికత
గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ. ప్రతీ పాటా కథతో పాటు ప్రయాణం చేసింది. నేపథ్య సంగీతం మరింత హాయిగా ఉంది. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. దర్శకురాలికి ప్రతిభ వుంది. మంచి కథల్ని ఎంచుకుంటే నిలబడగలదు. కథకు ఏం కావాలో నిర్మాత అందివ్వగలిగారు.
*ప్లస్ పాయింట్స్
సహజమైన సన్నివేశాలు
నటీనటుల ప్రతిభ
సంగీతం
*మైనస్ పాయింట్స్
అక్కడక్కడ నెమ్మదించిన కథనం
*ఫైనల్ వర్డిక్ట్: చూడగానే నచ్చేస్తుంది.
ALSO READ: 'చూసీ చూడంగానే' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి