సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ లది అద్భుతమైన కాంబో. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ దేవిశ్రీ ప్రసాద్ చేయి వదల్లేదు సుకుమార్. సుకుమార్ సినిమా ఎలా ఉన్నా సరే, అందులోని పాటలు సూపర్ హిట్. కాబట్టే ఈ కాంబో అనగానే సంగీత ప్రియుల్లో ఓ అంచనా మొదలైపోతుంది. ఇప్పుడు వాళ్లందరి దృష్టీ `పుష్ష` ఆల్బమ్ పై పడింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. దీనికి కూడా దేవిశ్రీ నే సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని దాక్కో దాక్కో మేక - పులొచ్చి కొరుకుతుంది పీక అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. శివం ఈ పాటని ఆలపించారు.
వెలుతురు తింటది ఆకు
ఆకుని తింటది మేక
మేకని తింటది పులి
ఆ పులినే తింటది చావు - అంటూ ప్రకృతి ధర్మాన్ని బోధిస్తూ సాగే పాట ఇది.
ఎన్ని దెబ్బలుతింటే, మనిషి అంత రాటుదేలతాడు అనే నిజాన్ని ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేశారు.
'దేవుడికైనా దెబ్బే గురువు
తన్నులు చేసే మేలు
తమ్ముడు కూడా సేయడు...
గుద్దులు చెప్పే పాఠం
బుద్ధులు కూడా సెప్పడెహే.. - అంటూ చరణాల్లో వినిపిస్తుంది.
ఈ పాట సౌండింగ్, ఆర్కెస్ట్రేజేషన్ అంతా బాగుంది. అయితే... `జల్సా`లో చలొరే చలొరే చల్.. పాటని ఈ ట్యూన్ కాస్త గుర్తు చేస్తుంది. ఆ పాటకీ దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడు కాబట్టి.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. మొత్తానికి.. పుష్ఫ తొలి పాట అదిరిపోయింది. ఇక మిగిలిన పాటలెలా ఉంటాయో..?
ALSO READ: Pushpa Dakko Dakko Meka Song