ENGLISH

ఫ్యాన్ వార్స్ vs మంచి సినిమాలు

01 May 2023-12:02 PM

ఒక మంచి సినిమా చేయాలన్న లేదా ఒక మంచి మల్టీస్టారర్ మూవీ తీయాలన్న చాలా కష్ట పడాలి. ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీ తీయాలంటే సాహసమే అని చెప్పాలి. అందులో సమానమైన స్టార్ డమ్ ఉన్న హీరోలతో సినిమా తీయాలంటే ఇంకా కష్టం.. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ వార్స్ ఎక్కువ. అలాంటి పెద్ద సాహసమే చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. జూ. ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్ లతో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తీసి ఎంత పెద్ద హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక సంచలనం.


ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అనుకున్న దానికంటే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు.  కానీ కొన్ని సందర్భాల్లో ఫ్యాన్ వార్స్ వల్ల మూవీ టీమ్ చాలా ఇబ్బంది పడింది. ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్ ఫాన్స్ అయితే మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆర్‌ఆర్‌ఆర్ రిలీస్ అయి సంవత్సరం అయిన ఇప్పటికీ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. సాదారణంగా ఎవరీ హీరోలపై వారి ఇష్టాన్ని చూపించొచ్చు అదే వేరే హీరోలని ట్రోల్ చేస్తూ అది పరిమితి దాటితే ఇండస్ట్రీకి అసలు మంచిది కాదు.


మన ఇండస్ట్రీలో ఉన్నది అయిదు, ఆరుగురు పెద్ద హీరోలే.. తిప్పికొడితే ఒక్కొక్క సినిమానే తీస్తాం ఏడాదికి... మేము మేము బానే ఉంటాం మీరే ఇంకా బాగా అవ్వాలి అని ఓ సందర్భంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. నిజం చెప్పాలంటే హీరోలందరికి ఒక మంచి సినిమా తీయడంలో పోటీ తప్ప మరో విషయంలో ఉండదు. ఎవరి స్టయిల్ వాళ్ళది, ఎవరి క్రేజ్ వాళ్ళది. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో కూడా ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి, ఫాన్స్ కి ఇవ్వాలనుకున్నారు. ఫాన్స్ కూడా మూవీలోని కథలో పాత్రలు చూడాలే తప్ప హీరోల మధ్య పోలికలు వెతకొద్దు. అప్పుడే ఎన్‌టి‌ఆర్, రామ్ చరనే కాదు ఇతర హీరోలు కూడా సంతోషపడతారు. అలాంటప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ లాంటి మంచి సినిమా లు, భవిష్యత్తులో మరిన్ని పెద్ద మల్టీస్టారర్ మూవీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది.