తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎం.జి. రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా, మరో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్నది.
జయలలిత ఉన్నత స్థాయి నటిగానే కాకుండా గొప్ప డాన్సర్ గానూ కీర్తి పొందారు. ఆమె పాత్రలో పరకాయప్రవేశం చేసిన కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్ ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ లుక్ లో శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటున్నారు. చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు చూస్తుంటే, అది ఒక నృత్య రూపకమనే అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన రాజకీయ నాయకురాలిగా జయలలిత లుక్, టీజర్, ఎంజీ రామచంద్రన్ లుక్ లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2020 జూన్ 26న 'తలైవి' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ALSO READ: Kangana Ranaut Latest Photoshoot