ENGLISH

దేవసేన ఆమెకు సక్సెస్‌ 'జోష్‌' ఇచ్చేనా?

07 June 2017-12:11 PM

ముద్దుగుమ్మ కార్తీక గుర్తుంది కదా. సీనియర్‌ నటి రాధ కుమారైగా హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చింది. 'రంగం' అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత తెలుగులో డైరెక్ట్‌గా 'జోష్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య హీరోగా పరిచయమైన ఈ సినిమా ఆశించినంత విజయం అందుకోలేదు. దాంతో కార్తీకకి అంతగా పేరు రాలేదు. తర్వాత నరేష్‌ హీరోగా వచ్చిన 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' తదితర చిత్రాల్లో నటించింది. అమ్మ రాధలానే మంచి నటి, మంచి డాన్సర్‌. గ్లామర్‌ అప్పీల్‌ కూడా ఉంది. కానీ అవకాశాలే దక్కలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ హిందీలో ఓ సీరియల్‌లో మెరవబోతోంది. ఆ సీరియల్‌లో కార్తీక దేవసేన పాత్రలో నటిస్తోంది. 'దేవసేన' పాత్ర పేరుకు 'బాహుబలి' సినిమాతో బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పుడు అదే పాత్ర పేరుతో కార్తీక సీరియల్‌లో నటిస్తోంది. ఈ సీరియల్‌ పేరు 'ఆరంభ్‌'. త్వరలోనే ప్రారంభం కానుంది. పేరుకు సీరియలే కానీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. గోల్డీ బెహెల్‌ దర్శకత్వంలో ఈ సీరియల్‌ రూపొందుతోంది. ఈయన ఎవరో కాదు, తెలుగు తెరపై పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సోనాలీ బింద్రే భర్త. అన్నట్లు ఈ సీరియల్‌కి కథని అందించింది ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్‌ కావడం విశేషం. ఈ సీరియల్‌తో కార్తీక బుల్లితెరపై మంచి పేరుతో పాటు స్టార్‌డమ్‌ రావడం కూడా ఖాయమని అంటోంది. 

ALSO READ: ఏకంగా మాజీ పీఎం పైనేనా!