ENGLISH

కొరటాలకి హేటర్స్‌ ఎక్కువైపోయారు

11 March 2018-10:00 AM

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా, మొన్నీ మధ్యనే కొరటాల శివ రాజకీయాల్లో ప్రధాన మంత్రి మోడీ గారినుద్దేశించి సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేశాడు. 

సినిమాలోని ఓ డైలాగ్‌ని అన్వయిస్తూ కొరటాల ఆ ట్వీట్‌ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదీ నిమిత్తం కేంద్రంలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పైనే కొరటాల స్పందిస్తూ, 'భరత్‌ అనే నేను' సినిమాలోని డైలాగ్‌ని అన్వయిస్తూ ట్వీట్‌ చేశాడు. 'ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మోడీజీ' అంటూ కొరటాల ట్వీట్‌ చేశారు. దాంతో ఆప్పుడే కొరటాల ప్రస్తుత రాజకీయ అంశాన్ని తన సినిమా ప్రమోషన్స్‌కి వాడుకుంటున్నాడంటూ ఓ వర్గం వారు కొరటాలపై శివమెత్తారు. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్‌ వేశాడు కొరటాల.' ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పార్టీలకతీతంగా, రాజకీయాలతీతంగా అందరూ ఏకమై స్వయం సహాయానికి దిగుతాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అలాగే ఉంది. ఈ పరిస్థితిలో పార్టీలు పక్కన పెట్టి, రాజకీయ నాయకులంతా ఒక్కటి కావాలి..' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

దాంతో ఆయన్ని హేట్‌ చేసే వర్గం ఎక్కువైపోయింది. ఆంధ్రకి సపోర్ట్‌ చేస్తున్నాడంటూ, తెలంగాణా, ఆంధ్ర గొడవలు తలెత్తుతున్నాయి. మరోపక్క సినిమా ప్రమోషన్స్‌కి రాజకీయాలను వాడేస్తున్నాడంటున్నారు కొంతమంది. అయితే కొరటాల ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేస్తున్నాడో లేదో తెలీదు. కానీ ఈ విషయమై కొరటాలకు హేటర్స్‌ మాత్రం ఎక్కువైపోతున్నారు. అలాగే ఏపీ తరపు నుండి ఫుల్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. కొరటాల మంచి మాట చెప్పాడంటూ, ఆయనలా మిగిలిన సినీ ప్రముఖులు కూడా స్పందిస్తే బావుంటుందని కొరటాలకు సపోర్ట్‌ చేసేవారు భావిస్తున్నారు.

ALSO READ: దయచేసి అలాంటి కథలు చెప్పకండి: రశ్మి