ENGLISH

ముఖ్యమంత్రి 'భరత్‌ రామ్‌' ఏ రాష్ట్రానికి?

08 March 2018-12:14 PM

తెలుగు రాష్ట్రాల్లో పోలిటిక్స్‌ వేడెక్కాయి. రోజుకో రకం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుత రాజకీయాలు. ఈ తరుణంలో పొలిటికల్‌ మూవీ అయిన 'భరత్‌ అనే నేను' ఇంట్రెస్ట్‌ పెంచుతోంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. 

తెలుగు సినిమా కాబట్టి, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి, లేదంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మహేష్‌ నటిస్తున్నాడని అనుకోవాలి. మరి మహేష్‌ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడో! ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ఈ తరుణంలో ఈ సినిమా రాజకీయాలను ఏరకంగా ప్రభావితం చేస్తుందనే విషయంపై అంతటా ఆశక్తి నెలకొంది. ఇదిలా వుంటే, ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు, టీజర్‌ వచ్చాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు అమాంతం పదింతలైపోయాయి. 

కొరటాల శివ స్క్రీన్‌ప్లే పనితనం ఆల్రెడీ 'శ్రీమంతుడు' సినిమాలో చూసేశాం. అయితే పొలిటికల్‌ సబ్జెక్ట్‌. అందులోనూ, పవర్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌తో వస్తున్న 'భరత్‌ అనే నేను' చిత్రం విషయంలో కొరటాల మరింత శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా 'భరత్‌రామ్‌' పాత్రలో మహేష్‌బాబు పవర్‌ ఫుల్‌ లుక్స్‌ అదరగొట్టేస్తున్నాయి ఇప్పటి వరకూ విడుదలైన స్టిల్స్‌లో. స్టైలిష్‌ గెటప్‌లో ముఖ్యమంత్రిగా క్యాబినెట్‌ని ఎలా మేనేజ్‌ చేశాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎలా పాలించాడు..అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. రాష్ట్రంలో రాజకీయాల సెగ ఈ స్థాయిలో ఉన్న టైంలో ఏప్రిల్‌ 20న 'భరత్‌ అనే నేను' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి 'పి.ఎ' పాత్రలో కైరా అద్వానీ కనిపించనుందనీ తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించారు.

ALSO READ: పొలిటికల్‌ సినిమాల సీజన్‌ షురూ