వరల్డ్ సినిమాపై హిచ్ కాక్ ప్రభావం అంతా ఇంతా కాదు. సుప్రసిద్ధ రచయితలు, దర్శకులు అంతా హిచ్ కాచ్‌ని చదివి వచ్చినవాళ్లే. ఆయన్ని అందరూ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని ముద్దుగా పిలుచుకొంటారు. మనం ఇప్పుడు చూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథలు, అందులో ఆహా ఓహో అనుకొంటున్న ట్విస్టులు... ఇవన్నీ ఆయన ముందే వెండి తెరకు రుచి చూపించేశాడు. కథని హిచ్ కాక్ మలుపు తిప్పినంతగా ఎవరూ తిప్పలేరు.. తిప్పబోరు. అదీ ఆయన స్పెషాలిటీ. అలాంటి గొప్ప దర్శకుడి గురించీ, ఆయన తీసిన సినిమాల గురించీ, అందులో ఆయన చేసిన ప్రయోగాల గురించీ విపులంగా చర్చిస్తూ, వివరిస్తూ, ఓ కథలా చెబుతూ ఓ పుస్తకం వచ్చింది. అదే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్.
ఈపుస్తకం ప్రత్యేకత ఏమిటంటే... 45మంది దర్శకులు, 10మంది జర్నలిస్టులు, ఏడుగురు రచయితలు కలిసి రాసిన వ్యాసాలివి. ఒకొక్కరూ ఒక్కో సినిమా గొప్పదనాన్ని అక్షరాల్లో ఆవిష్కరించారు. హిచ్ కాక్ సినిమాల గురించి మనకు తెలియని అపురూమైన విషయాలు అందించారు. ఈ పుస్తకానికి మల్లాది ముందు మాట రాయడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు, వంశీ లాంటి దర్శకులంతా తలో చేయి వేసి రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అవన్నీ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కానున్నాయి. పులగం చిన్నారాయణ, రవిపాడి ఈ సంకలనాన్ని తీసుకొచ్చారు. సినీ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లకు, ముఖ్యంగా హిచ్ కాక్ అభిమానులకు ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుంది.
ALSO READ: బలగం మొగిలయ్య ఇక లేరు