ENGLISH

Danayya: ఆస్కార్ ఆట‌లో.. ఆట‌లో అర‌టిపండు

20 March 2023-16:00 PM

నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చింది. ఇంత‌కంటే సంతోషించ‌ద‌గిన విష‌యం ఏదీ లేదు. ఈ క్రెడిట్‌.. కీర‌వాణి, చంద్ర‌బోస్‌ల‌కు ద‌క్కినా, ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్రేమ్ ర‌క్షిత్‌, కాల‌భైర‌వ‌, రాహుల్ సిప్లిగంజ్ పాత్ర‌లో ఒక్క‌రిది కూడా త‌క్కువ చేయ‌లేం. ముఖ్యంగా వీళ్లంద‌రినీ ముందుండి న‌డిపించిన రాజ‌మౌళికి స‌గం క్రెడిట్ ఇచ్చేయాల్సిందే. అయితే.. నిర్మాత ఏమైపోయాడు? అస‌లు ఇంత భారీ బ‌డ్జెట్ పెట్టిన దాన‌య్య‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు ఎందుకు? ఆఖ‌రికి చిత్ర‌బృందం కూడా దాన‌య్య‌కు ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌లేదెందుకు? ఆస్కార్ స్థాయి తీసిన నిర్మాత‌కు ఇందులో వాటా లేదా? ప్ర‌స్తుతం టాలీవుడ్ అంతా ఇదే చ‌ర్చ‌, టీమ్ మొత్తం నిర్మాత‌ని మ‌ర్చిపోయింద‌ని, త‌నని ఆట‌లో అర‌టిపండుగా చేసేశార‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంత‌మంది నిర్మాత‌లు బాహాటంగానే త‌మ నిర‌స‌న‌ని వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

నిజానికి... ఈ విజ‌యంలో నిర్మాత‌కీ వాటా ఉంది. కానీ.. చిత్ర‌బృందం ఆ పేరు విస్మ‌రించింది. అయితే దానికీ బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఆస్కార్ ప్ర‌మోష‌న్ల కోసం రాజ‌మౌళి చాలా డ‌బ్బే ఖ‌ర్చు పెట్టారు. ట్రేడ్ వ‌ర్గాలు ఈ ఖ‌ర్చు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని లెక్క గ‌డుతున్నారు. అంత ఉన్నా లేక‌పోయినా... రాజ‌మౌళి చేతి నుంచి డ‌బ్బు ప‌డింద‌న్న‌ది వాస్త‌వం. ఆస్కార్ ప్ర‌మోష‌న్ల కోసం కొంత డ‌బ్బు ఖ‌ర్చవుతుంద‌ని, దాన్ని నిర్మాత‌గా మీరు భ‌రిస్తారా? అంటూ రాజ‌మౌళి ముందే.. దాన‌య్య‌ని అడిగార్ట‌. కానీ దాన‌య్య అందుకు ఒప్పుకోలేదు. వ‌స్తుందో, రాదో తెలియ‌ని, ఆస్కార్ కోసం అన్ని డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌ర‌మా? అనేది దాన‌య్య మాట‌. అదీ నిజ‌మే. ఒకవేళ ఆస్కార్ వ‌స్తే ఆ క్రెడిట్ రాజ‌మౌళికి వెళ్తుంది. దాన‌య్య‌కు ఏం రాదు. అలాంట‌ప్పుడు దాన‌య్య రూ.80 కోట్లు ఎలా పెట్ట‌గ‌ల‌డు? ఆ డ‌బ్బుతో ఆయ‌న 10 చిన్న సినిమాలు తీసుకోవొచ్చు. అందుకే దాన‌య్య డ్రాప్ అయ్యారు. దాంతో ఆస్కార్ పెట్టుబ‌డి మొత్తం.. ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో తాను అందుకొన్న లాభాల నుంచి తీసి పెట్టాడు రాజ‌మౌళి. అందుకే ఆస్కార్ వ‌చ్చినా రాజ‌మౌళి ఆ క్రెడిట్ దాన‌య్య‌కు ఇవ్వ‌లేదు.