నటీనటులు : విశ్వక్ సేన్, నివేథ పేతురాజ్, సిమ్రాన్ చౌదరి తదితరులు
దర్శకత్వం : నరేష్ కుప్పిలి
నిర్మాతలు : బెక్కెం వేణుగోపాల్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : ఎస్ మణికందన్
ఎడిటర్: గ్యారీ B H
రేటింగ్: 2.25/5
పాటలు, టీజర్లు, ట్రైలర్లూ... ఓ సినిమాపై అంచనాలు పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా పాగల్ టీజర్, ట్రైలర్ చూసిన వెంటనే ఓ ఆసక్తి మొదలైంది. ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూడొచ్చన్న నమ్మకాన్ని కలిగించాయి. ఒక్కోసారి... అది ప్లస్ కావొచ్చు. ఒక్కోసారి ఆ అంచనాలే మైనస్ కూడా కావొచ్చు. మరి `పాగల్` పరిస్థితేంటి? సెకండ్ వేవ్ తరవాత.. సినిమాల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పాగల్ తన ప్రభావాన్ని చూపించగలిగాడా? లేదా?
* కథ
ప్రేమ్ (విశ్వక్ సేన్) ఏడేళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోతాడు. తనని తన తల్లిలానే ప్రేమించే అమ్మాయి కోసం అన్వేషణ మొదలెడతాడు. అలా.. ఏకంగా పదహారొందల మంది అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. ప్రతీ అమ్మాయితోనూ రిజెక్ట్ చేయించుకుంటాడు. ఆఖరికి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తాడు. ఎట్టకేలకు ఓ అమ్మాయిని (నివేదా పేతురాజ్)ని నిజంగానే ప్రేమిస్తాడు. తన తల్లిలాంటి మనసు తనకే ఉందని గ్రహించి తన చుట్టూ తిరుగుతాడు. మరి ఈ ప్రేమకథ ఏమైంది? ప్రేమ్ అన్వేషణ ఫలించిందా, లేదా? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
చాలా సింపుల్ లైన్ ఇది. రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కాకపోతే.. మదర్ సెంటిమెంట్ అన్నది కాస్త జోడించగిలిగాడు. తన తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం ఓ అబ్బాయి చేసే అన్వేషణ కాబట్టి.. స్ట్రాంగ్ బాండింగ్ పడినట్టే అనుకోవాలి. ప్రేమ్.. పేరుకి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఓ రకంగా ఆ పాత్రే ఈ సినిమాకి బలం.. బలహీనత. చిన్నప్పటి ఎపిసోడ్ తో ఈ కథ మొదలవుతుంది. అక్కడే బలమైన సెంటిమెంట్ డోస్ ఇచ్చేశాడు దర్శకుడు. దాన్ని కవర్ చేస్తూ... హీరో ఇంట్రడక్షన్ సీన్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఫన్ రైడ్ స్టార్ట్. అమ్మాయిల చుట్టూ తిరగడం, వాళ్లని పడేయడానికి ప్రేమ్ చేసే యత్నాలు, అమ్మాయిలు ప్రేమ్ ని రిజెక్ట్ చేయడం ఇవన్నీ ఫన్నీగా సాగుతాయి. అసలైన హీరోయిన్ (నివేదా) ఎంట్రీ వరకూ ఈ ప్రేమ గోల ఇలానే కంటిన్యూ అవుతుంది. కొన్ని ఎపిసోడ్లు పండాయి. కొన్ని బోర్ కొట్టించాడు. మొత్తానికి ఫస్టాఫ్ ఓ మిక్స్డ్ ఎమోషన్ తో సాగుతుంది. అయితే హీరో క్యారెక్టర్ లోనే ఫన్ ఉండడం, రియలిస్టిక్ కామెడీ జోలికి వెళ్లడంతో.. ఫస్టాఫ్ టైమ్ పాస్ అయిపోతుంది.
ఇక సెకండాఫ్‌లో అసలైన కష్టాలు మొదలవుతాయి. ఎప్పుడైతే ప్రేమ్ ప్రేమకథలో సీరియస్ నెస్ వచ్చిందో, అక్కడి నుంచి `పాగల్` ఓ సీరియల్ లా మారిపోతుంది. తన ప్రేమని దక్కించుకోవడానికి ప్రేమ్ చేసే ప్రయత్నాలు మరమ బోర్ కొట్టిస్తాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారతాయి. ఒక్కటంటే ఒక్క థ్రిల్లింగ్ మూమెంట్ లేదు. పైగా లవ్ స్టోరీలో ఎమోషన్ మిస్సయ్యింది. ఇంత ఫ్లాట్ నేరేషన్.. ఈ తరం ప్రేక్షకులు భరించలేరు. ఫస్టాఫ్ లో కనించే ఫన్ కూడా ద్వితీయార్థంలో అడ్రస్స్ లేకుండా పోతుంది. దాంతో.. సినిమాపై పట్టు తప్పేసింది. క్లైమాక్స్ కూడా రొటీన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అలా.. పాగల్ టైమ్ పాస్ సినిమాగా మొదలై.. టైమ్ కిల్లింగ్ సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
* నటీనటులు
విశ్వక్‌సేన్ ప్రేమ్ గా ఆడుతూ పాడుతూ చేసేశాడు. తన రియలిస్టిక్ నటనే చాలా రొటీన్ సన్నివేశాల్ని సైతం నిలబెట్టింది. లౌడ్ యాక్షన్ అన్నది అన్నిసార్లూ పనికి రాదు. కొన్ని సార్లు సెటిల్ గా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని విశ్వక్ గుర్తించుకోవాలి. నివేదా పేతురాజ్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. ఉన్నంతలో క్యూట్ గా ఉంది. మురళీశర్మ ఓకే అనిపించుకుంటాడు. భూమికది అతిథి పాత్ర అనుకోవాలి.
* సాంకేతిక వర్గం
పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా. కెమెరా వల్ల.. సినిమా ఇంకాస్త అందంగా మారింది. డైలాగులు కొన్ని యూత్ ఫుల్ గా ఉన్నాయి. కథలో మదర్ సెంటిమెంట్ లేకపోతే.. పాగల్ మరో రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ అయిపోదును. అయితే దాన్ని కూడా సరిగా వాడుకోలేదు. ఈ ప్రేమలో ఫీల్ లేదు. ఎమోషన్ లేదు. స్క్కీన్ ప్లే లోపాలు చాలా కనిపించాయి. దర్శకుడికి ఇది తొలి చిత్రం. అందుకే లెక్కకు మించిన సార్లు తడబడ్డాడు.
* ప్లస్ పాయింట్స్
విశ్వక్ నటన
పాటలు
* మైనస్ పాయింట్స్
ఎమోషన్స్ లేకపోవడం
రొటీన్ లవ్ స్టోరీ
సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: పాగల్ చల్ గయా
ALSO READ: 'పాగల్' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.