ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణతో పోలిస్తే... ఆంధ్రాలో టికెట్ రేట్లలో 30 శాతం వరకూ తేడా ఉంది. ఈ తేడా.. వసూళ్ల పరంగా భయంకరంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాలకు ఇది భారమే. అఖండ అన్ని చోట్లా మంచి వసూళ్లని అందుకుంటోంది. తెలంగాణలోలా... అక్కడా రేట్లు ఉండుంటే, ఈ సినిమా మరిన్ని వసూళ్లని అందుకునేది. ఈ బాధ పుష్పకీ తప్పేట్టు లేదు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ఈనెల 17న విడుదల అవుతోంది.
ఈ సినిమా బిజినెస్ ఎప్పుడో పూర్తయ్యింది. అల వైకుంఠపురములో రేట్లు చూపించి, పుష్పని ఆల్ టైమ్ హై రేట్స్‌కి అమ్మేశారు. నైజాంలో ఆ సొమ్ము రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఏపీలో మాత్రం అసాధ్యం. ఎందుకంటే అల వైకుంఠపురములో ఉన్నప్పటి రేట్స్‌కీ, ఇప్పటి రేట్స్ కీ చాలా తేడా ఉంది. పైగా బెనిఫిట్ షోలు లేవు. అదనపు ఆటలు లేవు. అందుకే భారీ రేట్లకు కొన్న బయ్యర్లు బిక్క మొహం వేశారు. అందుకే... మైత్రీ మూవీస్ కిందకు దిగి వచ్చింది. ఏపీలోని దాదాపు అన్ని ఏరియాల్లోనూ... రేట్లు తగ్గించింది. ముందు అనుకున్న మొత్తంలోంకి కనీసం 15 శాతం రిబేటు ప్రకటించింది. ఇది ఒకొక్క ఏరియాలో ఒక్కో రకంగా సాగింది. ఇలా రేట్లు తగ్గించడం వల్ల ఏపీలో దాదాపు 15 కోట్ల వరకూ... నిర్మాతలకు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.
నిర్మాతలు ఆ మేర నష్టపోయినా.. బయ్యర్లు హ్యాపీ. ఎందుకంటే.. ముందున్న ఎగ్రిమెంట్ల ప్రకారం చెల్లించాల్సిన డబ్బులో రిబేటు వచ్చింది కదా..? ఈ సంక్రాంతికి రాబోతున్న ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ ల హక్కులు కూడా ఇది వరకే అమ్ముడు పోయాయి. ఇప్పుడు వాళ్లంతా... రేట్లు తగ్గించమని నిర్మాతల్ని కోరే అవకాశం ఉంది. పుష్ప రేట్లు తగ్గించారు కాబట్టి.. ఈ సినిమాల రేట్లూ తగ్గించాల్సిందే.
ALSO READ: పుష్ప ట్రైలర్: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా .. ఫైరు