ENGLISH

మళ్ళీ జోడీగా నితిన్ - కీర్తి సురేష్..!

24 March 2025-14:21 PM

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా..  కొన్ని జోడీలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి కోవలోకే నితిన్ - కీర్తి సురేష్ పెయిర్‌ చేరుతుందని చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగ్ దే’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రోమోషన్లలోనూ, పాటల్లోనూ వీరి మధ్య గల సాన్నిహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇప్పుడు మరోసారి ఇదే కాంబో వెండితెరపై మెరవబోతోందన్న టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘యల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా కోసం తొలుత నాని, సాయిపల్లవిలను అనుకున్నప్పటికీ, వారి డేట్స్ కుదరకపోవడంతో నితిన్, కీర్తి సురేష్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం.

‘యల్లమ్మ’ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుండగా, ‘దసరా’ తరహాలో రగ్డ్ లుక్‌లో నితిన్, కీర్తి సురేష్ కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ‘రంగ్ దే’లో గ్లామరస్ లుక్‌లో కనిపించిన ఈ జంట, ఈసారి పూర్తిగా డీ-గ్లామరస్ రోల్స్‌లో ఆకట్టుకునే అవకాశం ఉందట.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. మరి, మరోసారి నితిన్ - కీర్తి సురేష్ కాంబినేషన్ అదిరిపోయే హిట్ అందుకుంటుందా? అన్నది చూడాలి!

ALSO READ: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా క్యాన్సిల్.. అసలు కారణం ఇదే..?