ENGLISH

'రాజా ది గ్రేట్‌' టీజరొచ్చేస్తోందోచ్‌

12 August 2017-13:44 PM

రవితేజ హీరోగా రూపొందుతున్న 'రాజా ది గ్రేట్‌' సినిమా. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్‌ 15వ తేదీన సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు. దిల్‌ రాజు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ ఈ సినిమాలో అంధుడిగా కన్పిస్తాడు. పాత్ర పరంగా రవితేజకి ఇది చాలా కొత్తదనంతో కూడిన సినిమాగా చెప్పుకోవచ్చు. అంధుడి పాత్రను రవితేజ ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడట. ఈ మధ్యనే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ 'అంధగాడు' అనే సినిమాలో నటించాడు. అందులోనూ రాజ్‌తరుణ్‌ అంధుడిగానే కనిపించాడు. ఆ సినిమాకీ రవితేజ సినిమాకీ హీరో పాత్ర అంధుడనేది ఒక్కటే కామన్‌ పాయింట్‌. అంధుడి పాత్రలో నటించాలంటే చాలా కష్టపడాలి. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాలి. మన మాస్‌ రాజా రవితేజ అదే చేస్తున్నాడట. అంధుల్ని చాలా దగ్గర్నుంచి అబ్జర్వ్‌ చేస్తూ తన పాత్రలో సహజత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట రవితేజ. మొత్తానికి 'రాజా ది గ్రేట్‌' పూర్తిగా కొత్తగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతినిస్తుందని చిత్ర దర్శక నిర్మాతలంటున్నారు. సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత రవితేజ నుండి వస్తోన్న సినిమా ఇది. మరో పక్క రవితేజ 'టచ్‌ చేసి చూడు' సినిమాలో నటిస్తున్నాడు. అతి తక్కువ గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయనీ సమాచారమ్‌.

 

ALSO READ: నితిన్ 'లై' తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్