సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో, అంతకంటే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. ఓ తప్పుడు వార్త సైతం.. వైరల్ గా మారుతోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో.. తెలుసుకోని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. సెలబ్రెటీలకు సంబంధించిన వార్తల్లో అయితే ఈ గందరగోళం మరింత ఎక్కువ. మొన్నామధ్య చంద్రమోహన్ చనిపోయారన్న వార్త బాగా వైరల్ అయ్యింది. `నేను బతికే ఉన్నా` అంటూ ఆయనే ఓ వీడియో విడుదల చేసేంత వరకూ ఆ వార్తనే చక్కర్లు కొట్టింది.
ఇప్పుడు శారద విషయంలోనూ అదే జరిగింది. దాదాపు 500 చిత్రాల్లో నటించిన శారద.. చాలాకాలంగా సినిమాలకు దూరంగా చెన్నైలోనే ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె మరణించారన్న వార్త.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మీడియా సర్కిల్స్ లో కూడా ఈ వార్త బాగా తిరిగింది. అయితే.. శారద కు ఏం కాలేదు. ఆమె బాగానే ఉన్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆమె ఓ సందేశాన్ని పంపారు. తనకేం కాలేదని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని, మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన గురించి ఏ వార్తనైనా, తనని సంప్రదించి ప్రచురించాలని మీడియాకు ఆమె కోరారు. ఏంటో ఈ కాలం.. `నేను బతికే ఉన్నా..`అంటూ స్వయంగా చెబితే గానీ, నమ్మే పరిస్థితుల్లో ఎవరూ ఉండడం లేదు.
ALSO READ: హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న కింగ్ నాగార్జున, చిత్రం