ENGLISH

టాలీవుడ్ లో విషాదం.. గీత ర‌చ‌యిత మృతి

12 September 2024-14:04 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ ఈ రోజు మరణించారు. కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న 77 ఏళ్ళ గురుచరణ్ గురువారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీనితో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. గురు చరణ్ కలం నుంచి అనేక అద్భుత గీతాలు వెలువడ్డాయి. అల్లుడు గారు సినిమాలో ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, రౌడీ గారి పెళ్ళాం సినిమాలో ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటకు గాయపడిన కోయిల’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ గురుచరణ్ కలం నుంచి జాలువారినవే.


గురుచరణ్ పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. ఇతని తల్లి తండ్రులు ఒకప్పటి నటి  ఎం.ఆర్.తిలకం, ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావు. సినిమాల్లోకి వచ్చాక గురుచరణ్ అని పేరు మార్చుకున్నారు. ఇతను MA చదివారు. ఆచార్య ఆత్రేయకి ప్రియ శిష్యుడు. గురుచరణ్ దాదాపు రెండు వందల పాటలు రాసారు. ముఖ్యంగా మోహన్‌బాబు ప్రతి సినిమాలో  గురుచరణ్ పాట కచ్చితంగా ఉండేది. మోహన్‌బాబు కూడా ఏరికోరి గురుచరణ్ తో పాట రాయించుకునేవారట.


మోహన్ బాబు సినిమాలో గుర్తుడిపోయే పాటలన్నీ గురుచరణ్ రాసినవే. ఈయన సాహిత్యం చెవులకి ఇంపుగా ఉండేది. అర్థవంతమైన పాటలు రచించటంలో గురుచరణ్ దిట్ట. పెళ్లి పీటలు లో 'నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మ', దేవుళ్లలో 'అయ్యప్ప దేవాయ నమః ' 'చిట్టెమ్మా పొట్టమ్మ' లాంటి సాంగ్స్ గురుచరణ్ వే. గురుచరణ్ సాహిత్యానికి జేసుదాస్ వాయిస్ కొత్త సొబగుని తెచ్చి పెట్టేది. అందుకే వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు మోహన్ బాబు.