ENGLISH

Sushanth: అక్కినేని హీరోకి 'మెగా' ఛాన్స్‌

18 March 2023-13:30 PM

కాళిదాసు, క‌రెంట్ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు సుశాంత్. అయితే త‌న‌కు ఓ సాలిడ్ హిట్ ద‌క్కలేదు. పైగా యువ హీరోలతో పోటీ ప‌డ‌లేక‌పోయాడు. దాంతో అవ‌కాశాలు త‌గ్గాయి. అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు కానీ, స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ట‌ర్న్ ఇచ్చుకొన్నాడు. ఈ ఎత్తుగ‌డ బాగానే ఫ‌లించింద‌నిపిస్తోంది. అల వైకుంఠ‌పురంలో ఓ కీల‌క పాత్ర పోషించాడు సుశాంత్‌. ర‌వితేజ రావ‌ణాసుర‌లోనూ న‌టిస్తున్నాడు. ఇందులో క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర త‌న‌ది. ఇప్పుడు సుశాంత్‌కి మెగా ఛాన్స్ ద‌క్కింది.

 

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భోళా శంక‌ర్‌లో సుశాంత్ కి ఓ కీ రోల్ వ‌రించింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. త‌మ‌న్నా క‌థానాయిక‌. ఇందులో కీర్తి సురేశ్ చిరుకి చెల్లాయిగా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తికి జోడీగా సుశాంత్ క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. చిరంజీవి సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రు మాత్రం వ‌దులుకొంటారు? అందుకే ... సుశాంత్ ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పేసుకొన్నాడు. మొత్తానికి టాలీవుడ్‌లో మ‌రో హీరో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా స‌క్సెస్‌ఫుల్‌గా ట‌ర్న్ తీసుకొన్నాడ‌న్న‌మాట‌.