ENGLISH

గతం గతః మర్చిపోవాల్సిందేనంటోన్న టాలీవుడ్‌

01 January 2021-14:56 PM

2020 తెలుగు సినీ పరిశ్రమకి ఓ పీడకల లాంటిదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. సంక్రాంతి రిలీజ్‌లు, ఆ తర్వాత వచ్చిన 'భీష్మ'.. ఇక అంతే సంగతులు. కరోనా దెబ్బకి, ఏడాదిలో తొమ్మిది నెలలు పూర్తిగా టాలీవుడ్‌ని ముంచేశాయి. వేరే దారి లేక, ఓటీటీలో సినిమాల్ని రిలీజ్‌ చేశారుగానీ, వాటి వల్ల టాలీవుడ్‌కి ఒరిగిందేమీ లేదు. టాలీవుడ్‌ ఇంత కష్టమైన పరిస్థితుల్లో వుంది గనుక, గత సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు', ఆ తర్వాత వచ్చిన 'భీష్మ' సినిమాల సక్సెస్‌ల గురించి గర్వంగా మాట్లాడుకునే పరిస్థితి టాలీవుడ్‌లో కనిపించడంలేదు.

 

2020ని పూర్తిగా మరిపోయి, కొత్త ఆశలతో 2021లోకి అడుగు పెడుతున్నామని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా ఆంక్షలు ఇంకా పూర్తిగా సడలిపోలేదు. కరోనా భయాలు ఇంకా అలాగే వున్నాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్తు ఏంటన్నదానిపై ఆందోళన మాత్రం తగ్గడంలేదు. 50 శాతం ఆక్యుపెన్సీ అనేది నిర్మాతలకు ఏ రకంగానూ లాభం చేకూర్చదు.

 

అయితే, సంక్రాంతి తర్వాత పరిస్థితులు మారొచ్చన్న ఆశాభావం అయితే టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. థియేటర్లు తెరిచాక, నెల రోజుల తర్వాత కరోనా కేసులు పెద్దగా పెరగకపోతే.. పూర్తిస్థాయిలో ఆక్యుపెన్సీ విషయమై ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఈలోగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తే.. అది ఇంకా సూపర్‌ గుడ్‌ న్యూస్‌ అవుతుంది టాలీవుడ్‌కి. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

ALSO READ: గోపీచంద్ త‌ప్పుకున్నాడు