ENGLISH

UI యూఐ మూవీ రివ్యూ & రేటింగ్‌

20 December 2024-15:07 PM

చిత్రం: UI 
దర్శకత్వం: ఉపేంద్ర   
కథ - రచన: ఉపేంద్ర

నటీనటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, జిషుసేన్ గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ కృష్ణ తదితరులు.

నిర్మాతలు: జి. మనోహరన్, శ్రీకాంత్ కెపి

సంగీతం: బి. అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: హెచ్. సి వేణుగోపాల్
ఎడిటర్: విజయ్ రాజ్ బిజి

బ్యానర్:  లహరి ఫిలిమ్స్ , వీనస్ ఎంటర్ టైనర్స్

విడుదల తేదీ: 20 డిసెంబరు 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పదేళ్ల తర్వాత నటించి, దర్శకత్వం వహించిన మూవీ 'యూఐ'. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం అన్ని భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా ఉపేంద్ర భారీగా ప్రమోషన్స్ చేసారు. తన మాటలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. పైగా పదేళ్ల తరవాత మెగా ఫోన్ పట్టడం, వందకోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కటం మూవీ పై అంచనాలు పెంచాయి. మరి 'యూఐ' ఉపేంద్రకి హిట్ ఇచ్చిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అన్యాయానికి గురి అవుతున్నప్రజల్లో అవగాహన పెంచుతూ, కులమతాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం సత్య (ఉపేంద్ర), అతని తండ్రి శాస్త్రి (అచ్యుత్ కుమార్) కృషి చేస్తుంటారు. శాస్త్రి ఓ జ్యోతిష శాస్త్ర నిపుణుడు. సత్య త‌న మంచిత‌నంతో ప్ర‌జ‌ల్ని త‌న‌వైపు తిప్పుకొంటాడు. జన్మ నక్షత్రం ప్రకారం సత్య కలియుగ భగవంతుడు అని శాస్త్రి అనౌన్స్ చేస్తాడు. అదే స‌మ‌యంలో క‌ల్కి (ఉపేంద్ర) కూడా రంగ ప్ర‌వేశం చేసి అధికారంచేజిక్కించుకుంటాడు. జేబు దొంగ వామనరావు (రవిశంకర్)రాజకీయ నాయకుడు. అతన్ని సెంట్రల్ సామ్రాట్ గా చేస్తానని కల్కి మాటయిస్తాడు. అస‌లు వీరిద్ద‌రూ ఎవ‌రు? వీరు ఏధర్మాన్ని పాటించారు? చివ‌రికి ఏ ధర్మం గెలిచింది? వామనరావును సెంట్రల్ సామ్రాట్ చేస్తానని చెప్పిన కల్కి చివరికి ఏం చేశాడు? కల్కిగా వచ్చినది సత్య కాదని, సత్య ట్విన్ (కవల సోదరుడు) అని ప్రజలతో పాటు వామనరావు కూడా తెలుసుకున్నాడా? లేదా? సత్య, కల్కి మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ సమాజానికి వాళ్లిద్దరూ ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే

విశ్లేషణ: 

పగలు, రాత్రి, కల్కి భగవాన్ వర్సెస్ సత్య అనే కాన్సెప్ట్‌తో మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో ఉపేంద్ర సెటైరికల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. హీరోగా, దర్శకుడుగా రెండు పడవలు మీద ఉపేంద్ర  ప్రయాణం చేస్తూ బ్యాలన్స్ చేసాడు. డిఫరెంట్ టేకింగ్‌తో వింటేజ్ ఉపేంద్రని గుర్తుకు తెచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్‌తో వచ్చే లవ్ ట్రాక్ లో సైకోఇజం చూపిస్తూ పాత ఉపేంద్రను గుర్తుకుతెచ్చాడు. ఇంట్వర్వెల్ సీన్ తో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చాడు. పాటలు కూడా సెటైరికల్‌గానే ఉన్నాయి. UI కి రెండు డిఫరెంట్ క్లైమాక్స్‌లు పెట్టారు ఉపేంద్ర. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఉపేంద్ర చూట్టునే కథ అల్లుకుని ఉంది. ప్రసుతం ప్రపంచంలో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్‌ను తెర మీద చూపించారు. మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్ళండి ధీమాగా చెప్పగలిగారు. 'తెలివైనవారు మూర్ఖులుగా, మూర్ఖులు తెలివైన వారిగా నటిస్తారు' అని ప్రారంభంలోనే ఒక హింట్ ఇచ్చాడు ఉపేంద్ర.

యూఐ మూవీ అర్థం కావాలంటే ప్రస్తుత పరిస్థితులు, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ విషయాలపై అవగాహన ఉండాలి. టీవీల్లో జరిగే  డిబేట్స్ మీద కూడా ఉపేంద్ర చాలా విషయాలు డిస్కస్ చేశారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల మీద సెటైరికల్ గా ఉపేంద్ర 'యూఐ' తీసారని అర్థం అవుతుంది. మంచి, చెడుల వ్యత్యాసం చెప్తూ సాగే ఈ మూవీ సామాన్య ప్రేక్షుడుకి అంతుపట్టని సమస్యలా ఉంటుంది. లాజిక్స్ లేని సీన్స్. గందరగోళం, ప్రేక్షకుడ్ని అయోమయానికి గురి చేస్తాయి. అందుకే తెలివైన వాళ్ళు బయటికి వెళ్ళండి అని అన్నారేమో ఉపేంద్ర. అర్థం కానీ వాడు కనీసం సినిమా బాగుందో లేదో చెప్పలేడు. మహా అయితే అర్థం కాలేదు అంటాడు. ఇదే ఉపేంద్ర దైర్యం కూడా.

ఉపేంద్ర ముఖ్యంగా చెప్పాలనుకున్నది 'గ్లోబ‌ల్ వార్మింగ్'. ఇది వ‌ర‌కు ప‌చ్చ‌గా, అందంగా, ఆరోగ్యంగా ఉండే నేల ప్రజంట్ మైనింగ్ మాఫియా, మెడిసిన్ మాఫియా, రియ‌ల్ ఎస్టేట్ మాఫియాతో నాశనం అయిపోయింది అన్నది మెయిన్ ఉద్దేశ్యం. భూమాత‌కు పుట్టిన వారసులే క‌ల్కి, స‌త్య‌. క‌ల్కి త‌న త‌ల్లికు జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొనే క్రమమే యూఐ. మొత్తానికి పొలిటిక‌ల్ సెటైర్లు, హ్యూమన్ మెంటాలిటీ, సినిమా వాళ్ల‌పైనా సెటైర్లుతో సినిమా ముగుస్తుంది.

నటీ నటులు:

'యూఐ' మూవీ మొత్తం ఉపేంద్ర కనిపిస్తాడు. నటుడిగా అద్భుత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. కాకపొతే ప్రేక్షకుడికి ముందు కథ అర్థమవ్వాలి అంతే. అది కొంచెం కష్టమే. నటుడిగా ఫుల్ మర్క్స్ కొట్టేసారు ఉపేంద్ర. సత్య, కల్కి అనే రెండు పాత్రల్లో వేరియేషన్స్ బాగా చూపించారు. ఉపేంద్ర నటనలో ఇంటెన్స్, డెప్త్ అర్థం అయితే ఇంకా బాగుంటుంది. హీరోయిన్ పాత్రలో రేష్మని ఎందుకుపెట్టారో, ఆ పాత్ర ద్వారా ఏం చెప్పాలి అనుకున్నారో తెలియదు. అయ్యప్ప శర్మ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడు. మిగతా నటీనటులు, వారి నటన తెలుగు వారికి అంత రిజిస్టర్ కావు.

టెక్నికల్ :

దర్శకుడిగా ఉపేంద్ర మార్క్స్ కోటేసినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడు. 'యూఐ' సినిమాలో మొదట కథ అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. కొంచెం అర్థం అయ్యాక  ఎందుకింత గందరగోళంగా కన్ఫ్యూజన్ గా చెప్పటం నార్మల్ గా చెప్పొచ్చు కదా అనిపిస్తుంది. అపరిచితుడు, భారతీయుడు, సినిమాల్లో హీరో కూడా జరుగుతున్న అన్యాయాలను ఎదిరించటానికి  వచ్చిన వారే, కానీ ఇంత గందరగోళం లేదు కదా, మరి ఉపేంద్ర ఎందుకు ఈ దారి ఎంచుకున్నాడు అనిపిస్తుంది. టెక్నీకల్ గా కూడా మూవీ బాగానే ఉంది. ఈ మూవీకి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్. విజువల్ ఎఫెక్ట్స్ మంచి వండర్ గా నిలిచాయి. విజువల్ వర్క్ లో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించటం లేదు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. సినిమా చూస్తుంటే నిజంగా ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్టు ఉంది.  సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. తక్కువ బడ్జెట్ తో ఒక వండర్ వరల్డ్ క్రియేట్ చేసి చూపించారు.

ప్లస్ పాయింట్స్ 

ఉపేంద్ర 
టెక్నికల్ టీమ్    
సంగీతం

మైనస్ పాయింట్స్ 

కథ 
గందరగోళం 
సామాన్యుడికి పరీక్ష

ఫైనల్ వర్దిక్ట్ : మెదడుకి మేత 'యూఐ'

ALSO READ: బచ్చల మల్లి మూవీ రివ్యూ & రేటింగ్‌