ENGLISH

జ‌గ‌న్ మీటింగ్‌... బాల‌య్య లేకుండానేనా?

06 June 2020-11:28 AM

ఈనెల 9న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ పెద్ద‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశ నేప‌థ్యం, అందులో చ‌ర్చించే అంశాలు, జ‌గ‌న్ ఇచ్చే వ‌రాల గురించి ఎవరూ మాట్లాడుకోవ‌డం లేదు గానీ, ఈ మీటింగ్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌ర‌రు అవుతారా, లేదా? అన్న‌దే హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వంతో టాలీవుడ్ కొన్ని స‌మావేశాలు ఏర్పాటు చేసింది. వాటికి బాల‌య్య వెళ్ల‌లేదు. అదేమ‌ని అడిగితే.. `న‌న్నెవ‌రూ పిల‌వ‌లేదు` అంటూ త‌న అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు బాల‌య్య‌. బాల‌య్య వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే లేపాయి. ఇండ్ర‌స్ట్రీలో అగ్ర స్థాయి క‌థానాయ‌కుడి ఆహ్వానం అంద‌క‌పోవ‌డం ఏమిట‌ని అంతా ప్ర‌శ్నించారు. ఇది ఎవ‌రింట్లో పెళ్లి? బొట్టు పెట్టి పిల‌వ‌డానికి? అంటూ కొంత‌మంది పెద్ద‌లు బాల‌య్య వైపే వేలు చూపించారు.

 

అందుకే ఇప్పుడు జ‌గ‌న్ మీటింగ్‌కి బాల‌య్య‌ని ఆహ్వానిస్తారా, లేదా? అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే.. ఈ మీటింగుల‌కు బాలయ్య హాజ‌రు కావ‌డం లేదని తెలుస్తోంది. ఈనెల 10న బాల‌య్య పుట్టిన‌రోజు. ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వం కూడా. ఆ ప‌నుల్లో బాల‌య్య బిజీగా ఉన్నాడ‌ని టాక్‌. అందుకే బాల‌య్య ఈ మీటింగుల‌కు రాలేక‌పోతున్నాడ‌ని తెలుస్తోంది. సో.. ఈసారీ నంద‌మూరి హీరో లేకుండానే.. మీటింగులు జ‌రిగిపోతున్నాయ‌న్న‌మాట‌.

ALSO READ: ఓటీటీలో సినిమా ఇక ఫ్రీ కాదు!