నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ తదితరులు
దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్
నిర్మాతలు : శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫర్ : రామ్
ఎడిటర్: కిరణ్ గంటి
రేటింగ్: 2.75/5
కొన్ని పాయింట్లు వినడానికి చెప్పుకోవడానికి భలే బాగుంటాయి. కానీ.. దాన్ని రెండు గంటల సినిమాగా మలచడం కత్తిమీద సాము. కథలు చెప్పుకోవడం వరకూ బాగుండి, తెరపై కొచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాయంటే కారణం అదే. `101 జిల్లాల అందగాడు` సినిమాలో పాయింట్ కూడా ఫన్నీగా ఉంటుంది. ఓ బట్టతల ఉన్న వ్యక్తికి.. పెళ్లి అవ్వడం లేదన్న బెంగ ఉంటుంది. తనలోని బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి తను ఎలాంటి పాట్లు పడ్డాడు? అన్నది కథ. సరిగ్గా ఇదే పాయింట్ తో బాలీవుడ్ లో `బాల` అనే సినిమా వచ్చింది. అక్కడ బాగానే ఆడింది. మరి.. ఇక్కడ ఈ అందగాడి పరిస్థితేంటి? అవసరాల శ్రీనివాస్ బట్టతలతో ఏ మేరకు మెప్పించాడు?
* కథ
సూర్య నారాయణ (అవసరాల శ్రీనివాస్)కి బట్టతల. తనని బట్టతలతో చూస్తే అందరూ నవ్వుతారన్నది తన భయం. అందుకే విగ్గు పెట్టుకుని కవర్ చేస్తుంటాడు. తనది బట్టతల అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. తన ఆఫీసులోనే అంజలి (రుహానీ శర్మ) కొత్తగా చేరుతుంది. తనకి దగ్గర కావాలని సూరి ప్రయత్నిస్తాడు. అంజలి కూడా సూరిలోని సెన్సాఫ్ హ్యూమర్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. మెల్లగా సూరిని ఇష్టపడుతుంది. అయితే బట్టతల విషయం అంజలికి చెప్పాలా? వద్దా? అనే సందిగ్థంలో ఉండిపోతాడు. తనది బట్టతల అని తెలిస్తే.. అంజలి ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో దాచేస్తాడు. మరి ఈ నిజం అంజలికి ఎప్పుడు ఎలా తెలిసింది? ఆ తరవాత ఏమైంది? అన్నదే కథ.
* విశ్లేషణ
చాలా మంచి కథ - చాలామంది కథ అనేది ఈ సినిమా క్యాప్షన్. నిజానికి ఇది చాలామందికి ఉన్న సమస్య. దాన్ని చాలా వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారిందులో. అవసరాల శ్రీనివాస్ పాత్రని పరిచయం చేసే విధానం, తన బట్టతలని దాచుకోవడానికి పడే కష్టాలు, రుహానీ శర్మని ఫ్లాట్ చేయడానికి చేసే ప్రయత్నాలూ.. ఇవన్నీ బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా హీరోయిన్‌కి తెలుగు రాదు అనుకుని, తెలుగు పాటలు పాడే సన్నివేశం బాగా పేలింది. హీరోయిన్ ఇంటికి డిన్నర్‌కి వెళ్లిన సీన్ లో హీరో విగ్గు ఊడిపోతుంది. అప్పుడు హీరో చేసే చేష్టలన్నీ నవిస్తాయి. ఇలా... ప్రతీ సన్నివేశంలోనూ వినోదం పండించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. దాదాపు అన్నిసార్లూ సఫలీకృతం అయ్యాడు. అనవసరమైన పాటలు, వేరే ట్రాకులు లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.
ద్వితీయార్థంలో కామెడీకి పెద్దగా స్కోప్ లేదు. అలాంటి చోట ఎమోషన్ ని ఆశ్రయించాడు. ఆత్మనూన్యతా భావం ఎందుకు ఉండాలి? అనే విషయంలో హీరోయిన్ హీరోని మోటివేట్ చేసే సీన్ బాగుంటుంది. చివర్లో హీరో ఇచ్చే స్పీచ్ కూడా. `అమ్మలో అందం చూసుకోం కదా..` అనే డైలాగ్ నచ్చుతుంది. తొలిసగంలో పేలినన్ని జోకులు, పండినంత వినోదం ద్వితీయార్థంలో ఉండదు. కాకపోతే... అక్కడక్కడ ఛమక్కులు తగులుతూనే ఉంటాయి. కానీ సరిపోలేదు. ఇంకాస్త కావాలి అనిపిస్తుంది. బాలీవుడ్ లో విజయవంతమైన `బాలా` సినిమా స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ పాయింట్ ని అవసరాల తనదైన స్టైల్ లో రాసుకున్నాడు.
* నటీనటులు
అవసరాల శ్రీనివాస్‌కి ఇది టేలర్ మేడ్ క్యారెక్టర్. తనే రచయిత కాబట్టి.. తన పాత్రని బాగా రాసుకోగలిగాడు. తన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఎమోషన్ కూడా పండించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటన నచ్చుతుంది. రుహానీ కీ మంచి మార్కులు పడతాయి. తన డ్రస్సింగ్ స్టైల్ కూడా బాగుంది. హీరో స్నేహితులుగా చేసినవాళ్లకీ మంచి స్కోపే ఉంది ఈ సినిమాలో.
* సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించింది.. అవసరాల శ్రీనివాస్. తనదైన మార్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. చాలా చోట్ల మాటలే సన్నివేశాల్ని నడిపించాయి. ద్వితీయార్థం కాస్త స్లో అయ్యింది. అయినా ఒక్క పాయింట్ తో 2 గంటలు కూర్చోబెట్టడం కష్టం. ఇలాంటి పాయింట్ పట్టుకున్నప్పుడు ఇలాంటి ఒడిదుడుకులు సహజం కూడా.
* ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
అవసరాల కామెడీ
ఫస్టాఫ్
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: విగ్గు లేకపోయినా అందగాడే
ALSO READ: ఇంకా మొదలెట్టలేదు.. అప్పుడే కాపీ ముద్ర!