ENGLISH

Taraka Ratna: తీవ్ర విషాదం : తారకరత్న అకాల మరణం

18 February 2023-20:40 PM

కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు 23 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో స్ప్రుహ కోల్పోయిన తారకరత్నను.. కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

 

అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

 

ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడే తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’తో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వరించాయి. ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘అమరావతి’ చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు.

 

తారకరత్న మరణంతో అభిమానుల్లో దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

 

తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.