ENGLISH

'సోలో' రిలీజ్‌.. టాలీవుడ్‌కి నరాలు తెగే ఉత్కంఠే.!

22 December 2020-11:18 AM

సినిమా థియేటర్లు పూర్తిగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయ్‌.. 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాతో ఆ అద్భుత ఘట్టానికి తెరలేస్తోంది. 'న్యూ నార్మల్‌' మార్గదర్శకాల నేపథ్యంలో 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.? అన్న ఉత్కంఠ సినీ పరిశ్రమలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ని బట్టి, థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే తీరుని బట్టి.. సంక్రాంతి సినిమాలపై సినీ పరిశ్రమకు నమ్మకం మరింత పెరగనుందన్నది నిర్వివాదాంశం. కరోనా నేపథ్యంలో గత మార్చి నెల నుంచి థియేటర్లు మూతబడ్డాయి.

 

థియేటర్లు తెరిచేందుకు గతంలోనే అనుమతులు లభించినా, 50 శాతం ఆక్యుపెన్సీ సహా అనేక నిబంధనల నేపథ్యంలో సినీ పరిశ్రమ కాస్తంత వెనకడుగు వేసింది. చివరికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవడంతో.. ధైర్యంగా పరిశ్రమ ముందడుగు వేసింది.

 

ఇక, 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమా విషయానికొస్తే, నిర్మాతల సాహసాన్ని అభినందించి తీరాల్సిందే. మారిన పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల కొత్తగా అనిపిస్తోంది.. సాధారణ వ్యవహారమే, కొత్త పరిస్థితుల నడుమ జరుగుతోంది.. అన్నది చిత్ర యూనిట్‌ వాదన. సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానుండగా, అడ్వాన్స్‌ బుకింగుల జోరు క్రమంగా పెరుగుతోంది.

ALSO READ: టిల్ మార్చేసిన సందీప్‌రెడ్డి