ENGLISH

'అంధ‌కారం' మూవీ రివ్యూ & రేటింగ్!

25 November 2020-15:00 PM

నటీనటులు : వినోత్ కిషన్, అర్జున్ దాస్, పూజా రామచంద్రన్, మిషా ఘోషల్ తదితరులు 
దర్శకత్వం : వి.విగ్నరాజన్
నిర్మాత‌లు : ప్రియా అట్లీ, సుధన్ సుందరం, జయరామ్, కె పూర్ణ చంద్ర
సంగీతం : ప్రదీప్ కుమార్
సినిమాటోగ్రఫర్ : ఏ.ఎమ్. ఎడ్విన్ సాకే
ఎడిటర్: సత్యరాజ్ నటరాజన్


రేటింగ్‌: 3/5


హార‌ర్ సినిమా అంటే దాదాపుగా అంద‌రికీ విర‌క్తి వ‌చ్చేసింది. అవ‌న్నీ ఎలా ఉంటాయ‌న్న విష‌యంలో... ఓ అవ‌గాహ‌న ఉంది. చీక‌టి గ‌దులు, అందులో భ‌యంక‌ర‌మైన ఆర్‌.ఆర్‌.. ఆత్మ‌లు క‌నిపించ‌డం, ఇంట్లో వాళ్ల‌తో ఓ ఆట ఆడుకోవ‌డం.. సాధార‌ణంగా హార‌ర్ సినిమాలు ఇలానే సాగుతుంటాయి. వీటికి భిన్నంగా ఓ ప్ర‌య‌త్నం చేస్తే.. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల దృష్టి అటువైపుకు వెళ్తుంది.

 

ఇది వ‌ర‌కు `పిచాచి` అనే ఓ సినిమా వ‌చ్చింది. అది దెయ్యం క‌థే. కానీ.. ఆ దెయ్యానికీ ఓ మ‌న‌సుంటుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దెయ్యం చిమ్నీలో దాక్కోవ‌డం కొత్త‌గా అనిపించింది. ఇప్పుడూ ఆ త‌ర‌హా కొత్త టెక్నిక్‌తో ఓ థ్రిల్ల‌ర్ క‌మ్ హార‌ర్ సినిమా వ‌చ్చింది. అదే.. `అంధ‌కారం`. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా వుంది?  ఏమిటా క‌థ‌..?


* క‌థ‌


ఇంద్ర‌న్ (న‌ట‌రాజ‌న్‌)  ఓ మాన‌సిక వైద్యుడు. త‌ను త‌న పేషెంట్స్‌ని ట్రీట్ చేసే విధానం చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటుంది. ఆ వైద్యం విక‌టించి, ఓ పేషెంట్ ఇంద్ర‌న్ తుపాకీతో కాల్చి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఆ ప్ర‌మాదంలో ఇంద్ర‌న్ త‌న గొంతు పోగొట్టుకుంటాడు. కౌన్సిల్ త‌న‌ని ప్రాక్టీస్ చేయ‌కుండా అడ్డుకుంటుంది. సూర్యం (వినోద్ కిష‌న్‌) కి క‌ళ్లు లేవు. కానీ ఆత్మ‌లతో మాట్లాడే శ‌క్తి త‌న‌కు ఉంది. త‌న కిడ్నీ ఆప‌రేష‌న్ కోసం డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. అందుకే ఓ ఆత్మ‌ని బంధించ‌డానికి ఒప్పుకుంటాడు.

 

మ‌రోవైపు వినోద్ (అర్జున్ దాస్‌) క‌థ న‌డుస్తుంటుంది. త‌ను అస‌లే డిప్రెష‌న్‌లో ఉంటాడు. త‌న ఇంటికి ఓ ఫోన్ కాల్ వ‌స్తుంటుంది. ఓ ఆత్మ త‌న‌తో మాట్లాడుతుంటుంది. దాన్నుంచి త‌ప్పించుకోవ‌డానికి వినోద్ శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తుంటాడు. కానీ ఓడిపోతుంటాడు. ప్రాక్టీస్ లేని ఇంద్ర‌న్ త‌న పేషెంట్ల కోసం ఏం చేశాడు?  సూర్యం ఆప‌రేష‌న్ పూర్త‌యిందా లేదా?  వినోద్ ని ఫోన్లో వెంటాడుతున్న
 ఆత్మ ఎవ‌రిది?  అన్న‌దే మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ఇప్ప‌టి వ‌ర‌కూ చూసిన హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల‌తో పోలిస్తే.. `అంధ‌కారం` త‌ప్ప‌కుండా కొత్త‌గా క‌నిపిస్తుంది. తొలి ప‌దిహేను నిమిషాలూ... మ‌న‌కు అర్థం కాని లోకాన్ని, ప్ర‌పంచాన్ని, వ్య‌క్తుల్ని చూస్తున్నామా?  అనే భ్ర‌మ క‌లుగుతుంది. కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంది. ఆ ఫ్లోని ప‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్టం. ఆ త‌ర‌వాత మెల్ల‌మెల్ల‌గా క‌థ‌లోకి వెళ్తాం. వినోద్ గ‌దిలో ఏం జ‌రుగుతుంది?  డాక్ట‌ర్ ఎందుక‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు?  అనేది అంతు చిక్క‌దు. విశ్రాంతి ముందు క‌థ కీ పాయింట్ లోకి రావ‌డం ద‌ర్శ‌కుల‌కు అల‌వాటు. కానీ.. ఇక్క‌డ అదీ జ‌ర‌గ‌లేదు. ఎప్పుడో క్లైమాక్స్ కి ముందు ముడి విప్పుతాడు. అయితే అప్ప‌టి వ‌ర‌కూ ఓ టెన్ష‌న్ అయితే క్రియేట్ చేయ‌గ‌లిగాడు.

 

ఈ సినిమా సుదీర్ఘంగా సాగుతుంది. దాదాపు మూడు గంట‌ల సినిమా.అయితే ప్ర‌తీ స‌న్నివేశం కీల‌క‌మే. పాత్ర‌ల మూడ్ ని ఎలివేట్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు చాలా స‌మ‌యం తీసుకున్నాడు. చివ‌రి పావు గంటా చూస్తే మాత్రం.. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న సందేహాల‌న్నీ ప‌టాపంచ‌లు అయిపోతాయి. ఓ కొత్త ఫీలింగ్ క‌లుగుతుంది. ఆ స‌న్నివేశం బుర్ర‌కు ఎక్క‌క‌పోతే గ‌నుక‌.. ఇదంతా ఎందుకు జ‌రిగింద‌న్న‌ది ఏమాత్రం అర్థంకాదు.


ద‌ర్శ‌కుడు ప్ర‌తీ విష‌యాన్నీ చాలా డిటైల్డ్ గా చెప్పాల‌నుకున్నాడు. దాని వ‌ల్ల సాగ‌దీత అనిపిస్తుంది. పైగా మూడు గంట‌ల సినిమా ఆయె. తొలి సీన్ తోనే థ్రిల్ క‌లిగించాడు ద‌ర్శ‌కుడు. ఏదో జ‌రిగింది.. ఇంకేదో జ‌ర‌గ‌బోతోంద‌న్న హింట్ ఇచ్చాడు. పేక ముక్క‌ని ఫొటోని తీసే సీన్‌.. అది జోక‌ర్ గా మారిపోవ‌డం... ఇవ‌న్నీ క‌చ్చితంగా హీట్ పెంచుతాయి.  క్లైమాక్స్ లో సూర్యంపై ప్రేమ‌, సానుభూతి క‌లుగుతాయి. కొంత‌మంది మ‌నుషులు ఎంత క్రూరంగా, స్వార్థంగా ఆలోచిస్తార‌న్న‌ది అర్థం అవుతుంది. మొత్తానికి సినిమాని చాలా థ్రిల్లింగ్ గా మొద‌లెట్టి, ఎమోష‌న‌ల్ గా ముగించాడు.


* న‌టీన‌టులు


సూర్యం పాత్ర‌ధారి.. వినోద్ కిష‌న్ ని కొన్ని త‌మిళ సినిమాల్లో చూశాం. ఇప్ప‌టి వ‌ర‌కూ నెగిటీవ్ పాత్ర‌లే పోషించాడు. ఈసారి మాత్రం త‌న పాత్ర‌తీరు, న‌టించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అంధుల బాడీ లాంగ్వేజ్‌ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ప్ర‌వ‌ర్తించాడు. అర్జున్ దాస్‌, న‌ట‌న‌రాజ‌న్‌... వాళ్ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ఎక్క‌డా న‌టిస్తున్న ఫీలింగ్ రానివ్వ‌కుండా చేశారు. అన్ని పాత్ర‌ల‌కూ త‌గిన న‌టీన‌టుల‌నే ఎంచుకున్నార‌నిపిస్తుంది.


* సాంకేతిక వ‌ర్గం


టెక్నిక‌ల్ విష‌యాల్లో ఈ సినిమాకి మంచి మార్కులు ప‌డ‌తాయి. అంధ‌కారం పేరుకి త‌గ్గ‌ట్టు ఓ డార్క్ మూడ్ ని క్రియేట్ చేయ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు. కెమెరా, నేప‌థ్య సంగీతం, ఆర్ట్ వ‌ర్క్ ఇవ‌న్నీ అద‌న‌పు బ‌లాలు. కొన్ని మాట‌లు క‌థ‌లోని మూడ్ ని ఎలివేట్ చేశాయి. స్క్రీన్ ప్లే కాస్త గంద‌ర‌గోళంగా ఉంటుంది. ఏది ముందు? ఏది వెనుక‌..? అన్న క‌న్‌ఫ్యూజ‌న్ త‌ప్ప‌నిస‌రి. అయితే...క్లైమాక్స్ చూశాక‌.. కాస్త క్లూ దొరికిన‌ట్టైంది. ద‌ర్శ‌కుడిలో చాలా విష‌యం ఉంది. త‌న మైండ్ లో ఉన్న‌ది స్క్రీన్ పై చ‌క్క‌గా తీసుకురాగ‌లిగాడు.


* ప్ల‌స్ పాయింట్స్‌

టెక్నిక‌ల్ వ‌ర్క్‌
క్లైమాక్స్‌
నేరేష‌న్‌


* మైన‌స్ పాయింట్స్

గ‌జిబిజి
నిడివి


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  థ్రిల్ల‌ర్స్‌కి ఓ కొత్త వెలుగు.

ALSO READ: తెలుగు సినిమాకి స్వర్ణయుగమే.. ప్రేక్షకులకో.!