ENGLISH

'అర్జున్‌ రెడ్డి' అదే పెద్ద ప్లస్‌ పాయింట్‌

23 August 2017-11:47 AM

కొన్ని సినిమాలకి విడుదలకు ముందు అనూహ్యంగా పబ్లిసిటీ వచ్చిపడ్తుంటుంది. కొన్ని సినిమాలు విడుదలకు ముందు ఎలాంటి సందడీ లేకుండా ఉంటాయి. వచ్చాక మాత్రం ఆ సినిమాలకి అనూహ్యంగా పబ్లిసిటీ వచ్చేస్తుంటుంది. 'పెళ్ళిచూపులు' సినిమా రెండో కోవలోకి వస్తుంది. ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండ, తాజాగా 'అర్జున్‌రెడ్డి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు హాట్‌ టాపిక్‌ అవడానికి కారణం సినిమాలోని లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌. దీని చుట్టూ రాజకీయమూ ముసిరింది. కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు సినిమా పోస్టర్లను చించేస్తూ హడావిడి చేశారు. దానికి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కౌంటర్‌ ఇస్తూ, 'ముసలాళ్ళకు కాదు ఈ సినిమా' అని తేల్చేశారు. అలా 'అర్జున్‌రెడ్డి' సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చాలా గట్టిగా వచ్చేసింది. హీరోయిన్‌ ఎవరు? దర్శకుడెవరు? ఇలాంటి అంశాల గురించి చర్చ పెద్దగా లేకుండానే 'అర్జున్‌రెడ్డి' సినిమాలో ఏముందోనన్న ఉత్కంఠ ఆడియన్స్‌లో ఏర్పడిందంటే దానికి కారణం లిప్‌ లాక్‌ పోస్టర్‌ తెచ్చిన వివాదమే. సినిమా నిర్మాత జరుగుతున్న వివాదం నేపథ్యంలో పోస్టర్లను తొలగించేందుకు నిర్ణయించారని సమాచారమ్‌. అయితే ఇప్పటికే రావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. జరగాల్సిన వివాదమూ జరిగింది. అదే సినిమాకి పబ్లిసిటీ పరంగా పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయ్యింది.

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి