ENGLISH

కేంద్ర మంత్రిగా చిరంజీవి?!

31 January 2024-13:24 PM

రాజ‌కీయాలు చిరంజీవికి కొత్త కాదు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి, 18 స్థానాల్లో ఎం.ఎల్‌.ఏల‌ను గెలిపించుకొన్నారు. ఆ త‌ర‌వాత పార్టీని న‌డ‌ప‌లేక‌, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగానూ ప‌ని చేశారు. పిద‌ప రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. అయితే రాజ‌కీయాలు చిరుని విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న రాజ‌కీయాల్లో రీ ఎంట్రీ ఇస్తార‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేజీ వైపు ఆయ‌న దృష్టి సారించార‌ని, బీజేపీ కూడా చిరుని త‌మ పార్టీలోకి లాక్కోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని గ‌ట్టిగా వార్త‌లొచ్చాయి. చిరంజీవికి ఇటీవ‌లే బీజేపీ ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌క‌టించింది. దాంతో మ‌ళ్లీ ఆ ఊహాగానాల‌కు ఊతం వ‌చ్చింది.


చిరుని త‌మ పార్టీవైపు లాక్కోవ‌డానికే బీజేపీ ప‌ద్మ విభూష‌ణ్ ఇచ్చింద‌ని, త్వ‌ర‌లోనే ఉత్త‌ర ప్ర‌దేశ్ లేదా బీహార్ కోటా నుంచి... చిరుని రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌న్న వార్త‌లు మ‌రింత‌గా ఊపందుకొన్నాయి. చిరుని రాజ్య‌స‌భ‌కు పంపితే, త్వ‌ర‌లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో చిరుని ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించుకొని, ఎన్నిక‌ల‌లో లాభ‌ప‌డాల‌ని బీజేపీ చూస్తోంది. అయితే చిరుకి ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆస‌క్తీ లేదు. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ పెద్ద‌లు మాత్రం చిరు మ‌న‌సు మార్చాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌వేళ కేంద్రంలో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. చిరుకి మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తామ‌ని హామీలు గుప్పిస్తున్నార్ట‌. మ‌రి చిరు ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటార‌న్న‌ది వేచి చూడాలి.