ENGLISH

'సాహో' సెట్‌లో కేంద్రమంత్రి.!

27 April 2019-12:00 PM

ప్రభాస్ నటిస్తున్న 'సాహో' షూటింగ్‌ ప్రస్తుతం ముంబయ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌ స్పాట్‌లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రత్యక్షమయ్యారు. ప్రభాస్ అండ్‌ టీమ్‌తో కలిసి నితిన్‌ గడ్కరీ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోల్లో దర్శకుడు సుజిత్‌తో పాటు, ఇతర టెక్నీషియన్లు హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ తదితరులు కనిపిస్తున్నారు. నితిన్‌ గడ్కరీ బీజేపీకి చెందిన సెంట్రల్‌ మినిష్టర్‌. 

 

ప్రభాస్ పెదనాన్న, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కూడా బీజేపీ పార్టీ తరపున సేవలందిస్తున్నారు. అక్కడ దగ్గర్లోనే 'సాహో' షూటింగ్‌ జరుగుతోందని తెలిసి, నితిన్‌ గడ్కరీ చిత్ర యూనిట్‌ని కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ వ్యవహారం చూస్తుంటే, ప్రభాస్ ఇమేజ్‌ని బీజేపీ ఇలా కూడా వాడేసుకుంటోందన్న మాట. ఇకపోతే భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది 'సాహో' సినిమా. 

 

దాదాపు భారీ యాక్షన్‌ సీన్ల చిత్రీకరణ పూర్తయింది. చిన్న చిన్న యాక్షన్‌ సీన్స్‌తో పాటు, పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ముంబయ్‌ షెడ్యూల్‌లో భాగంగా రెండు పాటలూ, మిగిలిన యాక్షన్‌ ఘట్టాల్నీ తెరకెక్కించనున్నారనీ తెలుస్తోంది. బాలీవుడ్‌ నుండి మందిరాబేడీ, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితర ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆగష్టులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: 'మంచు' మాటకి ఇంతలా విమర్శలా.?