ENGLISH

కరోనా కొత్త స్ట్రెయిన్‌: మళ్ళీ సినీ పరిశ్రమలో గందరగోళం

22 December 2020-13:36 PM

కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది. కరోనా ప్రికాషన్స్‌ నడుమ.. షూటింగుల్ని ఎలాగో పునఃప్రారంభించారు.. కొన్ని సినిమాల నిర్మాణం పూర్తయ్యింది.. కొత్త సినిమాలూ పట్టాలెక్కాయి. కొత్త సినిమాల రిలీజులకూ ముహూర్తాలు ఖరారవుతున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లోనే 'కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌' అంటూ ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ గందరగోళం బయల్దేరింది. యూకే సహా కొన్ని యూరోపియన్‌ దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ని కనుగొన్న దరిమిలా, మళ్ళీ కరోనా భయాందోళనలు పెరిగిపోతున్నాయి.

 

మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో నైట్‌ కర్‌ఫ్యూ షురూ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మునుపటి లాక్‌డౌన్‌ పరిస్థితులు వస్తాయా.? వస్తే, తమ పరిస్థితి ఏంటి.? అని సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. మిగతా రంగాలు వేరు, సినీ పరిశ్రమ వేరు. ఓ సినిమా పట్టాలెక్కి, పూర్తయ్యి.. విడుదలవ్వాలంటే.. పరిస్థితులు పూర్తిగా అనుకూలించాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఖర్చు చేసిన కోట్లు.. బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు పెద్దయెత్తున విడుదలయ్యే అవకాశం వుంది.

 

సగం ఆక్యుపెన్సీతోనే అయినా ఎలాగోలా సినిమాల్ని వడుదల చేసెయ్యాలనుకుంటున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. ఈ సమయంలో కరోనా భయాందోళనలంటే, థియేటర్లకు ప్రేక్షకులు వెళ్ళడం అనుమానమే.! ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ, కాస్త కోలుకుంటోందనుకున్న సమయంలో.. ఇంకోసారి దెబ్బ అంటే అంతే సంగతులు.!

ALSO READ: 'సోలో' రిలీజ్‌.. టాలీవుడ్‌కి నరాలు తెగే ఉత్కంఠే.!