ENGLISH

'క్రేజీ అంకుల్స్' మూవీ రివ్యూ & రేటింగ్!

20 August 2021-11:21 AM

నటీనటులు : శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి తదితరులు
దర్శకత్వం : ఈ సత్తి బాబు 
నిర్మాత‌లు : గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫర్ : బాల్రెడ్డి 
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి 


రేటింగ్: 1/5


ఏ క‌థ‌లో అయినా క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ ఉండాలి. ఈ సినిమా ఎవ‌రు చూస్తారు?  ఎందుకు చూస్తారు?  అనే లెక్క‌లు వేసుకోవాలి. చాలా సినిమాల‌కు యూతే.. మ‌హారాజ పోష‌కులు. వాళ్లు లేక‌పోతే..  థియేటర్లు లేవు. వ‌సూళ్లు లేవు. యూత్ ని ఆక‌ట్టుకోవాలంటే ర‌క‌ర‌కాల మార్గాలు. అయితే.. కొంత‌మంది బూతు, సెక్స్‌ని ఎర‌గా వేసి, యూత్ ని ఆక‌ర్షిద్దాం అనుకుంటారు. అలాంటి ట్రిక్కులు నూటికి 99 శాతం వ‌ర్క‌వుట్ అవ్వ‌వు. ఆ ఒక్క శాతం ఏదో అదృష్టం బాగుండి ఆడేస్తాయి. వాటిని న‌మ్ముకుని మ‌రో వంద సినిమాలు త‌యారైపోతాయి. `క్రేజీ అంకుల్స్` సినిమా చూస్తే... అలా యూత్ ని న‌మ్ముకుని తీసిన మ‌రో సీ గ్రేడ్ సినిమాలానే అనిపిస్తుంది.


* క‌థ‌


రెడ్డి (మ‌నో) రాజు (రాజా ర‌వీంద్ర‌), రావు (భ‌ర‌ణి శంక‌ర్‌) ముగ్గురూ స్నేహితులు. కుటుంబ భారం వ‌ల్ల‌, సంసార జీవితంలో సుఖాల్ని, సౌఖ్యాల్ని అనుభ‌వించ‌లేక‌పోతారు. ముస‌లోళ్లు అయిపోయేలోగా జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఫిక్స‌యిపోతారు. ఈ ముగ్గురికీ... స్వీటీ (శ్రీ‌ముఖి) అంటే పిచ్చ క్రేజ్‌. త‌న‌ని క‌నీసం ఒక్క రాత్ర‌యినా గ‌డ‌పాల‌ని అనుకుంటారు. అందుకోసం వాళ్లు చేసిన ప్ర‌య‌త్నాలేంటి?  ఆ క్ర‌మంలో స్వీటీతో ఏర్ప‌డిన చిక్కులెలాంటివి?  వీళ్ల బ‌ల‌హీన‌త‌ని ఆస‌రాగా చేసుకుని స్వీటీ వీళ్ల‌తో ఎలా ఆడుకుంది?  అనేది మిగిలిన క‌థ‌


* విశ్లేష‌ణ‌


క‌థ‌, టైటిల్‌, టీజ‌ర్‌.. ఇవి మూడూ చూడ‌గానే చెప్పేయొచ్చు... ఇది ఏ టైపు క‌థో. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్క్రీన్ ప్లే, స‌న్నివేశాల‌తో... దాదాపుగా రెండు గంట‌ల పాటు బీభ‌త్సం చేసిన సినిమా ఇది. అప్ప‌టి వ‌ర‌కూ చూపించాల్సిందంతా చూపించేసి, చివ‌ర్లో ఓ నీతివాక్యంతో జ‌నాల క‌ళ్లు తెరిపించి, థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు పంప‌డం - ఈ త‌ర‌హా సినిమాల ఆన‌వాయితీ. దాన్ని.. తు,చ త‌ప్ప‌కుండా పాటించారు ఈ క్రేజీ అంకుల్స్. ముదురు వ‌య‌సులో, ప‌డుచ‌మ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌డం, త‌న‌ని అనుభ‌వించాల‌ని చొంగ కార్చడం, అందుకోసం వేయాల్సిన వెధ‌వ్వేషాల‌న్నీ వేసేయ‌డం.. ఇదీ ఈ సినిమా సాగే తీరు.

 

ఇది వ‌ర‌కు రాజేంద్ర ప్ర‌సాద్ నుంచి `గోల్ మాల్ గోవిందం` అనే ఓ సినిమా వ‌చ్చింది. ఆ సినిమా ల‌క్ష‌ణాలు కొన్ని క‌నిపిస్తాయి. ఆ సినిమాలో ఉన్న‌దీ, ఇందులో లేనిది స్వ‌చ్ఛ‌మైన వినోదం. పాత్ర‌ల ప‌రిచ‌యం, వాళ్ల కోరిక‌లు, అందుకోసం చేసే ప్ర‌యత్నాల‌తో తొలి స‌గం సాగిపోతుంది. అందులో కామెడీ లేదు. వెర్రి మొర్రి వేషాలేయ‌డం త‌ప్ప‌. ప‌బ్బుల్లో పాటు, ఫ్ల‌ర్టింగుల‌తో.. ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది ఈ సినిమా. సెకండాఫ్ కి ముందు ఒక ట్విస్టు. అయితే అది కూడా నాసిర‌కంగానే సాగింది. చివ‌ర్లో భారీ సందేశం ఇచ్చి నా, ఈ సినిమాపై ఆల్రెడీ ప‌డిపోయిన ముద్ర‌ని అది చెరిపేయ‌లేక‌పోయింది. ఒక్క‌రి క్యారెక్ట‌ర్‌నీ స్ట్రాంగ్ గా రాసుకోక‌పోవ‌డం, క‌థ‌లో `యావ‌` త‌ప్ప‌, విష‌యానికి చోటు లేక‌పోవ‌డం, సిల్లీ సీన్లు, ఓవ‌ర్ యాక్టింగులు వెర‌సి - ఈ సినిమాని అధ‌పాతాళానికి తొక్కేశాయి. గంటా న‌ల‌భై ఐదు నిమిషాల ఫుటేజీ ఉన్న సినిమా ఇది. అంటే.. సెన్సార్ లో ఇంకెంత పోయిందో ఊహించుకోవొచ్చు. అది కూడా లేకుండా.. డైరెక్ట‌ర్ గా ఓటీటీలోకి ఈ సినిమా దిగ‌బ‌డిపోతే... ఫ‌లితాలు ఇంకెంత దారుణంగా ఉండేవో..?


* న‌టీన‌టులు


రాజార‌వీంద్ర ని రొమాంటిక్ ఫెలోగా ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో చూశారు. ఈసారీ అంతే. టీవీ సీరియ‌ల్స్ లో న‌టించే భ‌ర‌ణికి చాలా కాలం త‌ర‌వాత లెంగ్త్ ఉన్న పాత్ర ప‌డింది. అయినా ఉప‌యోగం లేదు. మ‌నో లాంటి గాయ‌కుడు చేయాల్సిన పాత్ర కాదేమో అనిపిస్తుంది. ఆయ‌న కామెడీ పండించాల‌ని చూసినా, రొమాంటిక్ గా చూసినా.. ఏదీ సెట్ కాలేదు. శ్రీ‌ముఖి కి ఇది వ‌ర‌కు చాలామంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వాట్న‌నింటినీ రిజెక్ట్ చేసి, ఈ సినిమా ఎందుకు ఎంచుకుందో అర్థం కాదు.


* సాంకేతిక వ‌ర్గం


టెక్నిక‌ల్ గా చెప్ప‌డానికి ఏం లేదు. క‌థ‌, క‌థ‌నాలు పేల‌వంగా ఉన్నాయి. స‌రుకు లేన‌ప్పుడే హ‌డావుడి చేయాల్సి వ‌స్తుంది. అదీ ఇందులో క‌నిపించ‌లేదు. నిర్మాణ విలువ‌ల గురించి మాట్లాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్తి చేద్దామ‌ని ఫిక్స‌యి ఉంటారు. అందుకు త‌గిన క‌థ‌, క‌థ‌నాల‌నే ఎంచుకున్నారు. ఓ అపార్ట్మెంట్ లో సాగే సినిమా ఇది. అక్క‌డే మొద‌లై... అక్క‌డే ముగుస్తుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌


టైటిల్‌


* మైన‌స్ పాయింట్స్


మిగిలిన‌వ‌న్నీ


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  లేజీ అంకుల్స్

ALSO READ: 'క‌న‌బ‌డుట‌లేదు' మూవీ రివ్యూ & రేటింగ్!