ENGLISH

'పద్మావతి' ఎందుకిలా చేసింది

22 November 2017-14:17 PM

'పద్మావతి' హీరోయిన్‌ దీపికా పదుకొనె హైద్రాబాద్‌కి రావాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమారై ఇవాంకా ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమానికి దీపికా పదుకొనె కూడా హాజరు కావాల్సి ఉంది. ప్రధాని మోడీ వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు మాత్రమే ఈ వేదికపై ప్రసంగించే అవకాశం. ఆ అరుదైన అవకాశాన్ని దీపికా పదుకొనె కూడా పొందింది. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమానికి దీపికా పదుకొనె హాజరు కాలేనని చెప్పిందట. 

అందుకు కారణం, 'పద్మావతి' సినిమాపై జరుగుతున్న నిరసనలే కారణం. ఏకంగా ఈ సినిమాలో నటించినందుకు దీపికా పదుకొనె ముక్కు కోస్తామని కొందరు, తల తీసేస్తామనీ కొందరు దారుణాతి దారుణంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే దీపికా ఈ కార్యక్రమానికి రావడం లేదనీ ఓ వర్గం అంటోంది.  అయితే ఇంకో వర్గం వాదన మరోలా ఉంది. 'పద్మావతి' సినిమాపై రాజకీయ ఒత్తిడులు బలంగా పని చేస్తున్నాయి. ఆ రాజకీయ ఒత్తిడులే, కావాలని దీపికాని ఈ కార్యక్రమం నుండి తప్పించారంటూ వాదన వినిపిస్తోంది. 

ఈ మధ్య విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి దీపికా విచ్చేసింది. సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డును అందుకుంది విజయవాడలో. ఒకవేళ దీపిక వైపు నుండి నిరసనలే కారణం అనుకుంటే, అక్కడికి వచ్చిన దీపికా ఇక్కడికి ఎందుకు రాదు. మొత్తానికి ఈ అరుదైన సమావేశానికి దీపిక రాకపోవడానికి గల కారణాలు ఏంటో కానీ, హైద్రాబాద్‌కి రావాల్సిన దీపిక రాకుండా ఆగిపోయింది. ఇకపోతే సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' సినిమా డిశంబర్‌ 1న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాపై వస్తున్న ఆందోళనల కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.

ALSO READ: రీ-యూనియన్ కి బాలయ్య ఎందుకు రానట్టు?