ENGLISH

సిద్దార్థ్ రాయ్ మూవీ రివ్యూ & రేటింగ్

23 February 2024-14:17 PM

చిత్రం: సిద్దార్థ్ రాయ్

నటీనటులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్

దర్శకత్వం: వి. యశస్వి 
నిర్మాతలు: జయ అడపాక
 
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు 
కూర్పు: ప్రవీణ్ పూడి


బ్యానర్స్: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్
విడుదల తేదీ: 23 ఫిబ్రవరి 2024

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

ఈమ‌ధ్య చిన్న సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర బాగా మెరుస్తున్నాయి. స‌రికొత్త కంటెంట్ తో వ‌స్తే... ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డానికి రెడీగా ఉన్నార‌న్న విష‌యం చాలా సినిమాలు రుజువు చేశాయి. 'సిద్దార్థ్ రాయ్‌' పోస్ట‌ర్లు, ప్ర‌మోష‌న్ కంటెంట్‌లో ఓ వైబ్ క‌నిపించింది. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల‌కు క్లోన్ వెర్ష‌న్‌లా ఉంద‌న్న ప్ర‌చారంతో ఈ సినిమాపై మ‌రింత ఫోక‌స్ పెరిగింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ప్రమోష‌న్‌లో ఉన్న జోష్‌.. తెర‌పై క‌నిపించిందా, లేదా?


క‌థ‌: సిద్దార్థ్ (దీప‌క్ స‌రోజ్‌) చిన్న‌ప్ప‌టి నుంచీ పుస్త‌కాల మ‌ధ్యే పెరుగుతాడు. బుర్ర నిండా ఫిలాస‌ఫీనే. మ‌నిషి బ‌త‌క‌డానికి తిండి, నిద్ర, సెక్స్ ఉంటే చాల‌నుకొంటాడు. అందుకే ఎమోష‌న్స్ కి దూరంగా బ‌తికేస్తాడు. త‌న అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న అన్నీ కొత్త‌గా ఉంటాయి. ఇవ‌న్నీ ఇందు (త‌న్వి)ని ఆక‌ర్షిస్తాయి. త‌న గురించి తెలుసుకోవాల‌న్న ప్ర‌య‌త్నం మొద‌లెడుతుంది. అయితే... సిద్దార్థ్ ప‌ర్వ‌ర్టెడ్ అని తెలుసుకొని దూరంగా ఉంటుంది. స‌డ‌న్‌గా సిద్దార్థ్ లోని ఇంటిలిజెన్స్ నీ, లాజిక్ నీ బ్రేక్ చేసే ఓ మూమెంట్ వ‌స్తుంది. అదేంటి?  ఆ సంఘ‌ట‌న సిద్దార్థ్ జీవితాన్ని ఎలా మార్చింది?  ఎమోష‌న్స్ ప‌ట్ట‌ని సిద్దార్థ్... ఇందు ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడు?  ఈ ప్రేమ క‌థ ఎలా న‌డిచింది?  ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.


విశ్లేష‌ణ‌: ఎలాంటి ఎమోష‌న్స్ లేకుండా లాజిక్ తో బ‌తికేసే మ‌నిషిలో ఎమోష‌న్స్ పుడితే ఎలా ఉంటుంది?  వాటిని కంట్రోల్  చేసుకోగ‌ల‌డా, లేదా? అనే పాయింట్ తో సాగే క‌థ ఇది. నిజానికి.. ద‌ర్శ‌కుడు య‌శ‌స్వీ ఓ కొత్త పాయింట్ ని ప‌ట్టుకొన్నాడు. రెగ్యుల‌ర్ పేట్ర‌న్‌లో సినిమాలు తీయ‌కుండా, త‌న తొలి సినిమాకే కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నం చేశాడు. ఈ విష‌యంలో త‌న‌ని అభినందించాల్సిందే. జీవితంలో లాజిక్ ముఖ్య‌మా, ఎమోష‌న్ ముఖ్య‌మా, ఏది ఏ స్థాయిలో ఉండాలి, రెండిటిమ‌ధ్య స‌మ‌తూకం పాటించ‌క‌పోతే జీవితం ఏమ‌వుతుంది? అనేది చాలా సీరియ‌స్ పాయింట్‌. దాన్ని సినిమాగా తీయాల‌న్న ఆలోచ‌న రావ‌డం బాగుంది. దానికి త‌గ్గ‌ట్టు సిద్దార్థ్ రాయ్ పాత్ర‌ని డిజైన్ చేసుకొని, దాని చుట్టూ ఓ క‌థ‌ని న‌డిపే ప్ర‌య‌త్నం చేశాడు. సిద్దార్థ్ రాయ్ జీవితం.. త‌న ఆలోచ‌న‌లు, లైఫ్ స్టైల్ ఇవ‌న్నీ చాలా ఆస‌క్తికరంగా ఉంటాయి. ఇలాంటి మ‌నిషి ఒక‌డుంటాడా, ఉంటే త‌న జీవితం, మ‌నుగ‌డ ఏమిటి? అనేది క‌థ‌లో చాలా కోర్ ఎమోష‌న్‌. క‌ట్టిప‌డేసే పాయింట్. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని బేస్ చేసుకొన్న క‌థ ఇది. అయితే ఇలాంటి క‌థ‌ల్లో ఇబ్బంది ఏమిటంటే, ఆ క్యారెక్ట‌ర్ కి ప్రేక్ష‌కుడు కూడా క‌నెక్ట్ అయితేనే, క‌థ‌లో లీనం అవుతాడు. లేదంటే 'ఇదేం క‌థ‌, ఇదేం పాత్ర‌' అనుకొనే ప్ర‌మాదం ఉంది.


సిద్దార్థ్ రాయ్‌ని ప‌రిచ‌యం చేస్తూ సాగే తొలి స‌న్నివేశాలు ఆస‌క్తి క‌లిగిస్తాయి. ద‌ర్శ‌కుడి కంటూ లైఫ్‌లో ఓ ఫిలాస‌ఫీ ఉంది, దాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అనిపిస్తుంది. ఆ క్యారెక్ట‌ర్ చుట్టూ డిజైన్ చేసుకొన్న సీన్లు కూడా కొత్త‌గా ఉన్నాయి. కొన్నిచోట్ల బోల్డ్ నెస్ క‌నిపిస్తుంది. అవ‌న్నీ యూత్ కి న‌చ్చుతాయి. అయితే రాను రాను.. ఆ పాత్ర మ‌రీ ఓవ‌ర్ ది బోర్డ్ వెళ్తోంద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఓ ద‌శ‌లో ఆ క్యారెక్ట‌ర్ తో డిస్క‌నెక్ట్ కూడా అవుతారు. సిద్దార్థ్ రాయ్‌లో వ‌చ్చే చేంజ్ ఓవర్  ఓవ‌ర్ మ‌రీ డ్ర‌మెటిక్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ల‌వ్ స్టోరీ మొద‌ల‌వుతుంది. అక్క‌డ కూడా సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంత మ‌ల్టీమిలీయ‌నీర్ రోడ్ల మీద `ఇందు.. ఇందు` అని తిర‌గడం, ఇంట్లో వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం మ‌రీ సినిమాటిక్ లిబ‌ర్టీ. ముగింపు మాత్రం కాస్త ఎమోష‌న‌ల్ గా సాగుతుంది. ఈ క‌థ‌కు ఇలాంటి ముగింపే స‌రైన‌ది కూడా.

 

న‌టీన‌టుల ప్ర‌తిభ‌: బాల న‌టుడిగా సుప‌రిచిత‌మైన దీప‌క్‌కి హీరోగా ఇదే తొలి సినిమా. తొలి అడుగులోనే చాలా బ‌రువైన పాత్ర చేసేశాడు. లాజిక్‌తో ఉన్న‌ప్పుడు ఒక‌లా, ఎమోష‌న్ క‌నెక్ట్ అయిన‌ప్పుడు మ‌రోలా క‌నిపించాడు. త‌న లుక్ బాగుంది. మంచి క‌థ‌లు ఎంచుకొంటే, టాలీవుడ్ కి మ‌రో యువ హీరో దొరికిన‌ట్టే. శాన్వీ అందంగా ఉంది. బోల్డ్ సీన్స్ లో బిడియం లేకుండా న‌టించింది. అయితే న‌ట‌న విష‌యంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. తెర‌పై చాలా పాత్ర‌లు క‌నిపిస్తాయి కానీ.. వీరిద్ద‌రే ఎక్కువ డామినేట్ చేస్తుంటారు.  యండ‌మూరి వీరేంద్ర‌నాధ్ ఓ చిన్న పాత్ర‌లో మెరిశారు.

 

సాంకేతిక వ‌ర్గం: ర‌ధ‌న్ పాట‌లు ఓకే అనిపిస్తాయి. నేప‌థ్య సంగీతం కూడా ఇంపాక్ట్ బుల్‌గా ఉంది. చిన్న సినిమా ఇది. సాంకేతికంగా భారీ హంగులు ఆశించ‌లేం. మాట‌లు క‌థ‌కు, స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు కుదిరాయి. అయితే ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువ‌. అస‌లే ఫిలాస‌ఫీ, పైగా మ‌న‌ది కాని భాష‌. కాబ‌ట్టి అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే. ద‌ర్శ‌కుడు య‌శ‌స్వీ ఓ కొత్త త‌ర‌హా క‌థ‌ని రాసుకొన్నారు. ఆ క‌థ‌ని నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆ ప్ర‌యాణంలో కొంత మేర మాత్ర‌మే విజ‌యం సాధించారు. కుర్రాళ్లకు న‌చ్చే స‌న్నివేశాలు ఇందులో కొన్ని ఉన్నాయి. అవే.. టికెట్లు తెగేలా చేయాలి.

 

ప్ల‌స్ పాయింట్స్‌
ఐడియా
బోల్డ్ సీన్స్‌
క్లైమాక్స్‌


మైన‌స్ పాయింట్స్‌
హీరో పాత్ర‌తో ఎమోష‌న్ క‌నెక్ష‌న్ లేక‌పోవ‌డం
ఫిలాస‌ఫీ ట‌చ్ ఎక్కువ కావ‌డం


ఫైనల్ వర్దిక్ట్ : ఇంకా బాగా 'రాయ్‌'యాల్సింది..!