ENGLISH

'అంధగాడు' వర్మకి నచ్చేశాడు

02 June 2017-16:44 PM

వర్మకి ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో చెప్పలేము. ఆయన ఊహ ఎవరికీ అందనిది. అలాంటి వర్మకి రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన 'అంధగాడు' సినిమా నచ్చేసిందట. ఏకంగా హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమా ఉందంటూ చిత్ర యూనిట్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నాడు. హీరో రాజ్‌తరుణ్‌ని అయితే ఇంకేముంది ఆకాశానికెత్తేస్తున్నాడు. రాజ్‌ తరుణ్‌ అంటే ఇంతవరకూ ఓ కామెడీ హీరోగానే చూశాం. కానీ రాజ్‌తరుణ్‌లో ఇన్ని యాంగిల్స్‌ ఉన్నాయన్న సంగతి ఈ సినిమా ద్వారా బాగా అర్ధమైంది అంటూ వర్మ చెబుతున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని వర్మ చూశారట. ఎమోషనల్‌ డ్రామా. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది ఈ సినిమా చూస్తున్నంత సేపు అన్నారు. వర్మ కాంప్లిమెంట్‌ ఇచ్చాడంటే ఈ సినిమాకి అంతకన్నా ఇంకేం కావాలి. అయితే మరో పక్క వర్మ కాంప్లిమెంట్‌ అయితే దక్కింది కానీ, సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. హెబ్బా పటేల్‌, రాజ్‌ తరుణ్‌ జంటగా నటించిన ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు. రాజేంద్రప్రసాద్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని దాసరి నారాయణరావుకి అంకితమిచ్చింది చిత్ర యూనిట్‌. 

 

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్