ENGLISH

చిత్ర‌సీమ నెత్తిన మ‌రో 'పిడుగు'

19 October 2020-16:00 PM

అస‌లే గోరు చుట్టు. ఆ పైన రోక‌లి పోటు అన్న‌ట్టు త‌యారైంది చిత్ర‌సీమ వ్య‌వ‌హారం. క‌రోనా వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. సామాజిక దూరం పాటిస్తూ, షూటింగులు చేసుకోవొచ్చ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా - అనుమ‌తులు వ‌స్తున్నా - హీరోలు ధైర్యం చేయ‌డం లేదు. ఇప్పుడు బ‌రిలోకి దిగుదామంటే... నెత్తిన మ‌రో పిడుగు ప‌డింది. అకాల వ‌ర్షాల‌కు.. షూటింగ్ మూడ్ మొత్తం పోయింది. ఈ వ‌ర్షాల‌లో షూటింగులేంటి? అంటూ వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. ఈ సీజ‌న్లో అంతు చిక్క‌ని విధంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

 

షూటింగుల‌కు అడ్డా అయిన హైద‌రాబాద్ అయితే వ‌ర్షాల‌కు అల్లాడిపోతోంది. ఎప్పుడు ఏ స్థాయిలో వ‌ర్షం కురుస్తుందో చెప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి వ‌ర్షాల‌లో అవుడ్డోర్ షూటింగులు అసాధ్యం. ఈ వ‌ర్షాల‌కు కొన్ని సెట్స్ కూడా పూర్తిగా పాడైపోయాయ‌ని స‌మాచారం. ఆర్‌.ఆర్‌.ఆర్‌, ఆచార్య సినిమాల షూటింగులు ఈ వ‌ర్షాల వ‌ల్లే ఆగిపోయాయ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు అక్క‌డ‌క్క‌డ మ‌ల్టీప్లెక్స్ లు తెరిచారు. వ‌సూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమాకి వెళ్దాం అనుకున్నా, వ‌ర్షాల వ‌ల్ల జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డానికే జంకుతున్నారు. అలా... చిత్ర‌సీమ‌పై వర్షాలు సైతం త‌మ కోపాన్ని చూపిస్తున్నాయి.

ALSO READ: బాల‌య్య నిజంగా సాయం చేశాడా?