ENGLISH

భీమా మూవీ రివ్యూ & రేటింగ్

08 March 2024-15:57 PM

చిత్రం: భీమా
దర్శకత్వం: ఎ హర్ష

నటీనటులు: గోపీచంద్, ప్రియా భవాణి శంకర్, మాళవిక శర్మ,నరేష్

నిర్మాతలు: కేకే రాధామోహన్
సంగీతం:  రవి బస్రూర్
ఛాయాగ్రహణం: స్వామి జె గౌడ 
కూర్పు: తమ్మిరాజు

బ్యానర్స్:  శ్రీ సత్యసాయి ఆర్ట్స్
విడుదల తేదీ: 8 మార్చి 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

కమర్షియల్ సినిమాల కొలతలన్నీ ప్రేక్షకులు ఎప్పుడో పసిగట్టేశారు. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా తీసి మెప్పించడం అంత తేలిక కాదు. కథలో బలమైన ఎమోషన్, కాంఫ్లిక్ట్ వుంటే తప్పితే ప్రేక్షకులకి రుచించడంలేదు. ఇలాంటి నేపధ్యంలో పక్కా కమర్షియల్ ప్యాక్డ్ సినిమా అంటూ 'భీమా'తో వచ్చారు గోపీచంద్. పైగా కన్నడ దర్శకుడు హర్ష తో జోడి కట్టాడు. ఆ కథకు ఆయన ఇచ్చిన ఫాంటసీ ఎలిమెంట్ ఎదో కొత్తదనం వుందనే నమ్మకాన్ని ఇచ్చింది. మరా కొత్తదనం ఏమిటి ? భీమా గోపీచంద్ కి కమర్షియల్ విజయాన్ని ఇచ్చిందా ?


కథ: అది క‌ర్నాట‌క‌లోని మ‌హేంద్రగిరి. అక్కడ మ‌హిమ గ‌ల శివాల‌యం. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ద‌శాబ్దాలుగా ఆ ఆల‌యాన్ని మూసేస్తారు. అక్కడ‌కి ఎస్‌ ఐగా వ‌స్తాడు భీమా (గోపీచంద్‌). వచ్చి రావడంతోనే మ‌హేంద్రగిరిని ప‌ట్టి పీడిస్తున్న రౌడీలని మట్టికరిపిస్తాడు . అయితే ఆ శివాలయం చుట్టూ ఏదో రహస్యం వుందని విష‌యం భీమాకు అర్థం అవుతుంది. ఇంతకీ ఆ శివాలయంలో వున్న రహస్యం ఏమిటి? అసలు భీమా ఎవరు? ఇవన్నీ తెరపై చూడాలి. 


విశ్లేషణ: మిస్టరీ, ఫాంట‌సీ, డివైన్ ఎలిమెంట్స్ ని కమర్షియల్ కథతో ముడిపెట్టి చెప్పాలనే దర్శకుడు ఆలోచన బాగానే వుంది. ఐతే ఈ అంశాలని కలిపిన విధానమే తేడాకొట్టింది. కొత్తదనం పక్కన పెడితే పరమ రొటీన్ కాలం చెల్లిన కమర్షియల్ సినిమాలా తెరపై కనిపించింది భీమా. ఒక ఫాంటసీ ఎలిమెంట్ తో ఆసక్తిగానే కథ మొదలౌతుంది. ఎప్పుడైతే హీరో పాత్ర తెరపైకి వచ్చిందో అక్కడి నుంచి గ్రాఫ్ పడిపోతుంది. భజన హీరోయిజంతో బలం లేని సన్నివేశాలతో విరామం వరకూ విసిగించేశాడు దర్శకుడు. ఆ ప్రేమ కథ అయితే మరీ ఎబ్బెట్టుగా వుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడని లవ్ ట్రాక్ ఇది. 


ఇంటర్వెల్ లో వచ్చిన ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో ఎంతోకొంత అంచనాలు పెంచుతుంది. సెకండ్ హాఫ్ ని బ్రదర్స్ సెంటిమెంట్ తో నడపాలని చూశారు. ఇది ఏ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. అందులో ఎమోషన్ ప్రేక్షకులకు పట్టదు. ఇక భీమా ట్రాక్ లో ఎమోషన్ కూడా రిజిస్టర్ కాదు. ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ని మాత్రం గ్రిప్పింగ్ గానే తీశారు. మొత్తానికి ఓ కొత్త సినిమా చూసిన అనుభూతిని పంచలేకపోయింది భీమా. 


నటీనటులు: భీమా పాత్రలో గోపీచంద్ సరిపోయారు కానీ ఆ పాత్రని మరీ రొటీన్ గా చూపించారు. యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నారు. మాళవిక శర్మ, ప్రియా భవాని పాత్రల్లో కూడా బలం లేదు. వెన్నెల కిషోర్ పర్వాలేదనిపిస్తాడు. నరేష్ కొన్ని చోట్ల నవ్వించారు. నాజర్ తన అనుభవాన్ని చూపించారు. రఘుబాబు, చమ్మక్ చంద్ర, రచ్చరవి పరిధిమేరకు కనిపించారు. 


టెక్నికల్: రవి బస్రూర్ నేపధ్య సంగీతం సినిమాకి ఓ ఆకర్షణ. బీజీఎం లౌడ్ గా వుంటుంది. స్వామీ జే గౌడ కెమరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అజ్జు మహాకాళి మాటల్లో కొత్తదనం లేదు.  కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఓ ఫాంటసీ ని జోడించాలనుకునే దర్శకుడి ఆలోచన బావుంది కానీ అది ఆచరణలో పేలవంగా వచ్చింది.  


ప్లస్ పాయింట్స్
గోపీచంద్, యాక్షన్ 
కమర్షియల్ ఎలిమెంట్స్,
నేపధ్య సంగీతం


మైనస్ పాయింట్స్: 
ఫస్ట్ హాఫ్ రొటీన్ 
బోర్ కట్టించిన భజన హీరోయిజం 
లవ్ ట్రాక్


ఫైనల్ వర్డిక్ట్ : భీమా.. యాక్షన్ పైనే ధీమా..!

భీమా రివ్యూ ఇంగ్లీష్ లో చదవండి

ALSO READ: REVIEW IN ENGLISH