ENGLISH

హ‌ను రాఘ‌వ‌పూడి మ‌ల్టీస్టార‌ర్ ఏమైంది?

02 March 2023-14:15 PM

ఓ హిట్టూ, వెంట‌నే ఓ ఫ్లాపూ.. ఇలా సాగుతోంది హ‌ను రాఘ‌వ‌పూడి కెరీర్‌. గ‌తేడాది సీతారామంతో ఓ క్లాసిక్ హిట్ అందుకొన్నాడు హ‌ను. ఈ సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. అయితే సీతారామం త‌ర‌వాత కొత్త సినిమా ఏదీ మొద‌ల‌వ్వ‌లేదు. అలాగ‌ని హ‌ను ఖాళీగా లేడు. ఓ క‌థ రాసుకొని రెడీగానే ఉన్నాడు. కాక‌పోతే ఈసారి మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ సిద్ధం చేశాడ‌ట‌. ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించ‌డానికి సిద్ధంగా ఉంది.

 

కాక‌పోతే... హీరోల‌తోనే అస‌లు స‌మ‌స్య‌. తెలుగులో హీరోలంతా బిజీగా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక్క హీరో దొర‌క‌డ‌మే క‌ష్టం. అలాంటిది ఇద్ద‌రు హీరోల‌ను ప‌ట్టుకోవ‌డం అంటే మామూలు విషయం కాదు. అందుకే.. హ‌ను సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. సీతారామం విష‌యంలోనూ ఇదే స‌మ‌స్య ఎదుర్కొన్నాడు హ‌ను. తెలుగులో త‌న‌తో సినిమా చేయ‌డానికి హీరోలెవ‌రూ సిద్దంగా లేక‌పోయేస‌రికి మ‌ల‌యాళం నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్‌ని తెచ్చుకోవాల్సి వ‌చ్చింది. అది.. హ‌నుకి బాగా క‌లిసొచ్చింది. ఈసారి కూడా ప‌రాయి హీరోల్నే దిగుమ‌తి చేసుకోవాలేమో..?