ENGLISH

నాని ధైర్యమైన మాట - కోర్ట్ పై అపార నమ్మకం!

08 March 2025-22:01 PM

‘కోర్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో, నిర్మాతగా నాని తన సినిమా మీద పెట్టుకున్న నమ్మకం టాలీవుడ్‌లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమాతో, ‘కోర్ట్’ నచ్చకపోతే తన తదుపరి చిత్రం 'హిట్ 3 – ది థర్డ్ కేస్' చూడొద్దని స్టేజ్‌పై ఓపెన్ ఛాలెంజ్ విసరడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకు ముందు కూడా హీరోలు తమ సినిమాలపై సవాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి, కానీ అవి ఎక్కువగా హైప్ కోసం, వైరల్ కావాలనే ఉద్దేశంతోనే జరిగాయి. అయితే, నాని లాంటి స్టార్ హీరో ఇలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వడం చాలా అరుదు. పైగా, ఆయన గ్లామర్ ట్రిక్స్‌కి దూరంగా ఉండే వ్యక్తి.

ఈ పరిణామాల్ని గమనిస్తే, ‘కోర్ట్’ కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనేది స్పష్టమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో బాలీవుడ్ తరహా కోర్ట్ డ్రామాలు పెద్దగా హిట్ కాలేదు. ‘దామిని’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ‘ఊర్మిళ’గా రీమేక్ చేస్తే సూపర్ ఫ్లాప్ అయ్యింది. ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరోతో తీసివుంటే ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే, ‘కోర్ట్’ మాత్రం అన్ని వర్గాలను మెప్పించేలా ఏదో స్పెషల్‌గా ఉండబోతుందనే సంకేతాలు ట్రైలర్‌లోనే కనిపిస్తున్నాయి. నాని కూడా అదే నమ్మకంతోనే "సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ చూడొద్దు" అంటూ సవాల్ విసిరినట్టు తెలుస్తోంది.

మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రం మంచి టైమింగ్‌లో రిలీజ్ అవుతోంది. పెద్దగా పోటీ లేకపోవడం కలిసి రావొచ్చు. మార్చి మొదటి వారం రిలీజైన సినిమాలు అంతగా ప్రభావం చూపించలేదు. కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ తప్ప మరో సీరియస్ కాంపిటీషన్ లేదు. ముఖ్యంగా, రిలీజ్‌కు ముందు ప్రీమియర్లు ప్లాన్ చేయడం నానికి తన కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకానికి మరో నిదర్శనం.

ALSO READ: రామాయణ్ కోసం సాయి పల్లవి ఎంత తీసుకుందో తెలుసా?