చిత్రం: జనక అయితే గనక
దర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్ల
కథ - రచన : సందీప్‌రెడ్డి బండ్ల
నటీనటులు: సుహాస్ , సంగీర్తన, రాజేంద్ర ప్రసాద్ , గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ , మురళీ శర్మ.
నిర్మాతలు: దిల్ రాజు , హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిక్
సినిమాటోగ్రఫీ : సాయిశ్రీరామ్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 12 అక్టోబర్ 20024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
'సుహాస్' పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. షార్ట్ ఫిలిం తో తన జర్నీ మొదలుపెట్టి, సినిమాల్లోకి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యాడు. తరవాత విలన్ గా కూడా మెప్పించాడు. కలర్ ఫొటో మూవీతో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. హీరో గానే బిజీగా మారాడు. కొన్ని హిట్ లు కొన్ని యావరేజ్ లు, ఇంకొన్ని గుణపాఠాలతో తన జర్నీ కొనసాగిస్తున్నాడు. మూడు నెలలకు ఓ సినిమా లెక్కన థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ' గొర్రె పురాణం'తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ వారం 'జనక అయితే గనక' అనే సినిమాతో బాక్సాఫిస్ ముందుకొచ్చాడు. దసరా పురస్కరించుకుని ఈ మూవీ రిలీజ్ చేసారు. ఎప్పుడు దసరా బరిలో పెద్ద సినిమాల హడావుడి ఉండేది. ఈ సారి సూపర్ స్టార్ రజనీ కాంత్ వేట్టయాన్, గోపీచంద్ విశ్వం, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో.. ఇలా మూడే సినిమాలు ఉండటంతో ఈసారి సుహాస్ దైర్యం చేసాడు. కథ పై ఉన్న నమ్మకంతోనే వీరితో పోటీ పడుతున్నామని మూవీ యూనిట్ తెలిపింది. ఇంతకీ ఈ టైటిల్ వెనక అర్థమేంటి, సుహాస్ దసరా హిట్ కొట్టాడా లేదా ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
ప్రసాద్(సుహాస్)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకే పెళ్లయినా పిల్లలని కనటానికి లెక్కలు వేసుకుని ఒక క్లారిటీ మెయిన్ టైన్ చేస్తుంటాడు. పిల్లల్ని కనటానికి ముందే వారి బాధ్యతలు , వారి భవిష్యత్తు లెక్కలు వేస్తూ, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఆ మాటకొస్తే అన్నీ ది బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటాడు. అందుకే ముందే అన్నీ సమకూర్చుకోవాలని పిల్లల్ని కనటం వాయిదా వేస్తుంటాడు. నెలకి 30వేలు సంపాదించే ప్రసాద్ లెక్కలు మీద లెక్కలు వేస్తూ, పెళ్లయి రెండేళ్ళు అవుతున్నా పిల్లలని ప్లాన్ చేయడు. ప్రసాద్ భార్య (సంగీర్తన ) భర్త మనసెరిగి నడుచుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు గూర్చి ప్రశ్నించినా ఎదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. అంతే కాదు ఒక పిల్లాడని పెంచాలన్నా కోటి రూపాయిలు ఉండాలని మాటలతో మాయ చేస్తాడు. దీంతో ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఇక పిల్లలు గూర్చి అడగడు. ఇలా ఏదో ఒకలా తన ప్లాన్ వర్కౌట్ అయ్యింది అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ప్రసాద్ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లలు పుట్టకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నా భార్య ప్రేగ్నెంట్ అవటంతో షాక్ తిన్న ప్రసాద్ కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత కథ ఏంటి? ఈ కేసు ఎలా ముందుకు నడించింది. కోర్టులో ఈ సున్నిత విషయాన్ని ఎలా వాదించారు? ప్రసాద్ వేసిన కోటి నష్టపరిహారం గెల్చుకున్నాడా లేదా? ఈ ప్రయాణంలో అతని మానసిక స్థితి, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ప్రస్తుత జనరేషన్ పెళ్లి, పిల్లలు అంటే ఎందుకు వెనకంజ వేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత చాలా మంది పిల్లల్ని కనటానికి ఎందుకు ఇష్టపడటం లేదో ఈ సినిమాలో చూపించారు. మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ కొత్తగా ఉంది. కండోమ్ కంపెనీపై కేసు వేయటం అనేది కొంచెం వినూత్నంగా ఉంది. మధ్య తరగతి నేపథ్యం, వారి సాధక బాధకాలు అన్నీ కామన్ అయినా, దర్శకుడు కండోమ్ కంపెనీపై కేసుతో కొత్త అంశాన్ని చర్చించాడు. సినిమాలోని ప్రసాద్ లాగే చాలా మంది బాధితులు ఉండి ఉంటారు. దర్శకుడు ప్రయత్నం మెచ్చుకోదగిందే. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా తీస్తూ ఇలాంటి కథని ఎంచుకున్నాడేంటి అనిపించినా, అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునేలా ఉంది 'జనక అయితే గనక' ఆర్ధిక పరిస్థితుల వలన పిల్లలని వద్దునుకున్నా పేరెంట్స్ అయితే కలిగే మాధుర్యాన్ని చూపించారు. ఒక టైంలో కడుపులో ఉన్న బిడ్డ ద్వారా తండ్రికి ప్రేమ పుటించారు. కామెడీతో సినిమాని ఆద్యంతం నడిపారు.
పెళ్లైన ప్రతీ జంట, పిల్లలు పిల్లలు అని నిలదీసే పెద్దలు అందరూ ఈ కథకి కనక్ట్ అవుతారు. మూడు తరాల వాళ్లకి తమని తాము చూసుకునేలా చేసాడు దర్శకుడు. కండోమ్ చుట్టూ కోర్టు డ్రామా తెరకెక్కించటం దర్శకుడి సాహసమే అని చెప్పాలి. అసలు ఈ కథకి కోర్టు డ్రామా ప్రధానం. సున్నితమైన అంశాన్ని అశ్లీలతకి తావివ్వకుండా పూర్తి వినోదాత్మకంగా నడిపించారు. మౌత్ టాక్ తో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కండోమ్ కంపెనీపై కేసు పెట్టడం, కోర్టు డ్రామా ప్రధానంగా తెరెకెక్కిన ఈ సినిమాలో మొదట అంతా స్లోగా సాగి నెక్స్ట్ ఇంటర్ వెల్ కి కోర్టు డ్రామా మొదలవుతుంది. మురళీ శర్మ రాకతో కథనం మరింత రక్తి కడుతుంది. చివర్లో వెన్నెల కిషోర్ కూడా ఈ కథకు తనవంతు సహాయం చేశాడు. మధ్యతరగతి సాధక బాధకాలు చెబుతూనే, సమాజంపై ఓరకమైన సెటైర్ వేశాడు దర్శకుడు. అవన్నీ కనెక్ట్ అయ్యే అంశాలే.
నటీనటులు:
సుహాస్ కి ఇలాంటి పాత్రలు చేయటం కొత్తేమి కాదు. తనలోని నటుడ్ని మరొకసారి వెలికి తీసాడు. ప్రతి మధ్య తరగతి వాడికి కనెక్ట్ అయ్యాలా ఉంది సుహాస్ పాత్ర, నటన. ప్రసాద్ పాత్రలో సుహాస్ జీవించేసాడు. ఈ కథకి సుహాస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హీరోయిన్ సంగీర్తన భర్త నీడలో నడిచే భార్యగా చక్కగా నటించింది. ఆ పాత్రలో సంగీర్తన నటన హుందాగా ఉంది. లాస్ట్ కోర్ట్ సీన్‌లో ఆమె ఎంట్రీ బాగుంది. సాధారణ మధ్యతరగటికీ చెందిన భార్య ఎలా ఉంటుందో అలాగే కనిపించింది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ కామెడీ రక్తి కట్టింది. సెకెండ్ హాఫ్ లో మురళీ శర్మ ఆకట్టుకున్నారు. జడ్జ్ గా రాజేంద్ర ప్రసాద్ నటన పరవాలేదు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు ఉన్నాయి.
టెక్నికల్ :
దర్శకుడి రచనా స్టయిల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ గా కేజీఎఫ్ , సలార్ లాంటి యాక్షన్ జోనర్లకి వర్క్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల ఇప్పుడు ఇలాంటి మధ్య తరగతి కథని ఎంచుకోవటం విశేషమే. పబ్లిక్ గా మాట్లాడటానికి కూడా ఇష్టపడని ఒక టాపిక్ ని తీసుకుని సినిమా తీయటం, కోర్టు డ్రామాగా నడిపించి ఆడియన్స్ ని మెప్పించటంలో దర్శకుడు విజయం సాధించాడు. నవ్వులతో ఆడియన్స్ ని మాయ చేసాడు. బేబీ సినిమాకి అద్భుత సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ మూవీలో అంతగా ఆకట్టుకోలేకపోయారు. పాటలు అంత గొప్పగా లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో నేపథ్యం సంగీతం డిస్టబెన్స్ గా అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివర్లో బామ్మ ట్విస్ట్ మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కామెడీ
కథ
మైనస్ పాయింట్స్
లాజిక్స్ మిస్సింగ్
స్క్రీన్ ప్లే
ఫైనల్ వర్దిక్ట్ : ఫ్యామిలీతో వెళ్తే 'గనక' నవ్వులే నవ్వులు.