ENGLISH

జయప్రకాష్‌రెడ్డి.. నటుడు మాత్రమే కాదు.!

08 September 2020-16:16 PM

సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన హఠాన్మరణంపై సినీ పరిశ్రమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది’ అన్న భావన సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరిలోనూ కన్పిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చాలామంది, ‘గొప్ప నటుడ్ని కోల్పోయాం..’ అని చెప్పడమే కాదు, ‘మంచి మానవతావాదిని కోల్పోయాం..’ అని అంటున్నారు. సినీ పరిశ్రమ పట్ల ఆయన అంకిత భావం చాలా గొప్పదన్నది ప్రతి ఒక్కరి నుంచీ విన్పిస్తోన్న మాట.

 

సినీ పరిశ్రమ పట్ల ఎంత గౌరవం ఆయనకు వుండేదో, అంతే గౌరవం నాటక రంగం పట్ల కూడా వుండేది. సాధారణంగా సినీ పరిశ్రమలో రాణిస్తే, ఆ తర్వాత నాటక రంగం పట్ల చిన్న చూపు ప్రదర్శిస్తారు. అయితే, జయప్రకాష్‌రెడ్డి ఇందుకు మినహాయింపు. నాటక రంగం కోసం కొన్ని సినిమా అవకాశాల్నీ కూడా వదులుకున్నారాయన. ‘నాటక రంగం చాలా చాలా గొప్పది. అది అంతరించిపోయే కళల జాబితాలోకి చేరిపోతోంది..’ అని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసేవారు. సినీ పరిశ్రమలో చాలామంది యంగ్‌స్టర్స్‌ని ఆయన ప్రోత్సహించారు. దర్శకులకు సలహాలు ఇచ్చేవారు. నిర్మాతలతో సఖ్యతగా మెలిగారు. చాలా సినిమాల్లో విలనిజం పండించినా, ఎందరో హీరోయిన్లు.. ఆయన పట్ల చాలా గౌరవ మర్యాదలు ప్రదర్శించేవారు. ‘మా ఇంటి మనిషిని కోల్పోయాం..’ అని జెనీలియా తదితర నటీమణులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

ALSO READ: మల్టీస్టారర్‌ కోసం మహేష్‌ మెగా ప్లానింగ్‌.