ENGLISH

'జోహార్‌' మూవీ రివ్యూ & రేటింగ్!

14 August 2020-12:20 PM

నటీనటులు : శుభలేఖ సుధాకర్, నైనా గంగూలీ, ఎస్తర్ అనిల్ తదితరులు 
దర్శకత్వం :  తేజ మార్ని 
నిర్మాత‌లు : సందీప్ మార్ని
సంగీతం : ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం 
సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకటి 
ఎడిటర్: సిధార్థ తాతోలు, అన్వార్ అలీ


రేటింగ్: 2.75/5


రాజు చ‌రిత్ర రాతి విగ్ర‌హాల‌కే ప‌రిమితం. ఎన్ని విగ్ర‌హాలు క‌డితే అంత గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు. ప్ర‌తి వీధిలోనూ ఎవ‌రివో ఒక‌రి విగ్ర‌హాలు క‌నిపిస్తుంటాయి. ఊరు ఊరంగా విగ్ర‌హాల‌తో నింపేస్తుంటారు. ఎన్ని క‌ట్టినా, ఇంకోటి ఎక్క‌డో చోట వెలుస్తుంటుంది. రాజ‌కీయాల‌న్నీ విగ్ర‌హాల మ‌యం అయిపోయాయి. అయితే దాని కోసం ఎంత ప్ర‌జాధ‌నం వెచ్చిస్తున్నారో అర్థం కాదు. హంగులు, ఆడంబ‌రాలు.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో పాటు సామాన్యుడి జీవితాన్నీ ఎంత చిన్నాభిన్నం చేస్తుందో అర్థం చేసుకోరు. వాట‌న్నింటినీ తెర బ‌ద్ధం చేసిన సినిమా `జోహార్‌`.


* క‌థ‌


తండ్రి అత్యుత‌రామ‌య్య (చ‌ల‌ప‌తిరావు) మ‌ర‌ణంతో.. సీఎం సీటులో కూర్చుంటాడు విజ‌య్ వ‌ర్మ (కృష్ణ చైత‌న్య‌). తండ్రి అవినీతి ప‌రుడ‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు తిప్పికొడుతూ, త‌న తండ్రిని భావిత‌రాలు మ‌ర్చిపోని విధంగా ప్ర‌పంచంలోనే అత్యంత భారీ విగ్ర‌హాన్ని నిర్మించాల‌నుకుంటాడు. అందుకోసం మూడు వేల కోట్లు అవ‌స‌రం అవుతాయి. ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల్లో కోత విధించి, త‌ద్వారా మూడు వేల కోట్లు మిగిల్చి, ఆ డ‌బ్బుతో విగ్ర‌హం క‌ట్టాల‌ని భావిస్తాడు.


గంగ‌మ్మ (ఈశ్వ‌రీరావు)ది శ్రీ‌కాకుళం. ఫ్లోరైడ్ స‌మ‌స్య‌తో.. భ‌ర్త‌ని కోల్పోతుంది. ఒక్క‌గానొక్క కూతురూ అదే జ‌బ్బు బారీన ప‌డుతుంది. పొలం కౌలుకి తీసుకుని, క‌ష్ట‌ప‌డిపంట పండిస్తే.. అది కాస్త వ‌ర్షార్ఫ‌ణం అవుతుంది. ప్ర‌భుత్వం అందించే న‌ష్ట‌ప‌రిహారం అంద‌క‌పోవ‌డంతో - కూతురికి వైద్యం అందించ‌లేక అల్లాడిపోతుంది.


బాల‌... ఓ అనాథ‌. స‌ర్క‌స్ లో ఆడి, పాడి డ‌బ్బులు సంపాదించుకుంటుంది. త‌న‌లో ఓ అథ్లైట్ ఉంద‌ని గుర్తిస్తాడు ఓ కోచ్‌. అన్నివిధాల బాల‌ని రాటుదేలుస్తాడు. కానీ.. స‌రైన ఆహార స‌దుపాయాలు అంద‌క‌పోవ‌డం.. అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోతుంది బాల‌. త‌ల్లి వ్య‌భిచార రొంపిలోకి దింపుతుంటే త‌ట్టుకోలే వార‌ణాసి నుంచి పారిపోయి వ‌స్తుంది జ్యోతి. ఇక్క‌డ చ‌దువుకుని, త‌న కాళ్ల‌పై నిల‌బ‌డ‌దాం అనుకుంటే.. ప్ర‌భుత్వం అందించే స్కాలర్ షిప్పుల్లో కోత ప‌డ‌డంతో.. త‌న చ‌దువు ఆగిపోతుంది.


బోసు (శుభ‌లేఖ సుధాక‌ర్‌) ఓ దేశ‌భ‌క్తుడు. అనాథ పిల్ల‌ల్ని చేర‌దీసి చ‌దివిస్తుంటాడు. త‌న హాస్ట‌ల్ భ‌వ‌నం మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌భుత్వ అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరుగుతుంటాడు. కానీ ప్ర‌భుత్వ స‌హాయం మాత్రం అంద‌దు. బోసు, జ్యోతి, బాల‌, గంగ‌మ్మ‌.. ఈ నాలుగు క‌థ‌లూ.. సీఎం క‌ట్టించ‌బోతున్న విగ్ర‌హం కింద ఎలా నిలిగిపోయాయ‌న్న‌ది జోహార్ క‌థ‌.


* విశ్లేష‌ణ‌


నాలుగు జీవితాల చుట్టూ తిరిగే క‌థ ఇది. ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ సంబంధం ఉండ‌దు. కానీ ఈ నాలుగు జీవితాలూ.. ప్ర‌భుత్వ ఆడంబ‌రాలు, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌డంతో చిన్నాభిన్న‌మవుతాయి. అదెలా అన్న‌ది జోహార్ చూస్తే తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు చేసిన నిజాయ‌తీ ప్ర‌య‌త్న‌మిది. స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతుంది. స్టార్లు లేరు, క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేవు. కానీ వాస్త‌వ ప‌రిస్థితులు మాత్రం కావ‌ల్సిన‌న్ని ఉన్నాయి. బాధ‌లు, పేద‌రికం, రోగాలు, వ్య‌భిచార రొంపి.. వీటితో సినిమా కాస్త క‌ష్టంగా, నిదానంగా న‌డుస్తుంది. కానీ.. అవ‌న్నీ వాస్త‌వాలే. మ‌న చుట్టూ జ‌రుగుతున్న విష‌యాలే.

 

దేశ ఆర్థిక‌, రాజ‌కీయ ప‌రిస్థితుల్ని డైలాగులు, సన్నివేశాల ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. బోసు, జ్యోతి క‌థ‌లు క‌దిలిస్తాయి. మిగిలిన వాటిలో ఇంకాస్త డెప్త్ అవ‌సరం. ద్వితీయార్థం చివ‌రి వ‌ర‌కూ.. ఈ నాలుగు క‌థ‌లూ స‌మాంత‌రంగా సాగుతూనే ఉంటాయి. అవ‌న్నీ ఎక్క‌డ ముడిపెడ‌తాడా?  అని చూస్తుంటే.. ప్ర‌భుత్వ ప‌థకాలు అనే ఓ  గొడుగు కింద‌కు చేర్చారు. ఆడంబ‌రాల కోసం, ప్ర‌జా ధ‌నాన్ని వృధాగా ఖ‌ర్చు పెడుతున్న పెద్ద‌ల‌కు ఇది చెంప పెట్టు. విగ్ర‌హాల కింద చితికిపోయి, వాటికి స‌మాధులుగా మారిన ఎన్నో జివితాల‌కు ఈ సినిమా సాక్ష్యం. కాక‌పోతే.. సినిమా అంతా నిదానంగా, బ‌రువుగా న‌డుస్తుంటుంది. దాన్ని భ‌రిస్తూ.. రెండు గంట‌ల పాటు ఓపిగ్గా చూడ‌గ‌ల‌గాలి.


* న‌టీన‌టులు


చైత‌న్య కృష్ణ యువ సీఎంగా ఒదిగిపోయాడు. త‌న బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. ఈశ్వ‌రీరావు, శుభ‌లేఖ సుధాక‌ర్‌... వీళ్లంతా అనుభ‌వం ఉన్న వాళ్లే. జ్యోతి, బాల‌... వీళ్ల‌లో చాలా ప్ర‌తిభ వుంది. బాల‌గా క‌నిపించిన అమ్మాయిలో సిమ్రాన్ పోలిక‌లు క‌నిపించాయి. అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయిన‌వాళ్లే.


* సాంకేతిక‌‌త‌


పాట‌లు క‌థ‌లో అంత‌ర్భాగంగా వ‌చ్చాయి. సాహిత్యం కూడా బాగా కుదిరింది. డైలాగులు ఆలోచింప‌జేస్తాయి. ముఖ్యంగా రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలు. ద‌ర్శ‌కుడిలో ఏదో చెప్పాల‌న త‌పన ఉంది. ఆ విష‌యంలో కొంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అయ్యాడు. కాక‌పోతే స్క్రీన్ ప్లే మ‌రీ నిదానంగా సాగింది. బాధ‌లు, క‌ష్టాలూ ఎక్కువ‌య్యాయి.

 

* ప్ల‌స్ పాయింట్స్
నేప‌థ్యం
రాజ‌కీయ వాస్త‌వ ప‌రిస్థితులు
న‌టీన‌టులు

 

* మైన‌స్ పాయింట్స్‌
నిదానంగా సాగిన స్క్రీన్ ప్లే
భార‌మైన ముగింపు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:   నిజాయ‌తీ ప్ర‌య‌త్నం

ALSO READ: 'జోహార్‌' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.