ENGLISH

'నాన్నకు ప్రేమతో ' దటీజ్‌ ఎన్టీయార్‌

04 September 2017-12:01 PM

తండ్రి హరికృష్ణ మీద అమితమైన ఇష్టం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి. ఆ ఇష్టాన్ని ఎప్పటికప్పుడే చాటుకుంటూ ఉంటాడు. తాజాగా మరో సారి తండ్రి ప్రేమను చాటుకున్నాడు ఎన్టీఆర్‌. 'జై లవకుశ' ఆడియో ఫంక్షన్‌లో ఈ సందర్భం చోటు చేసుకుంది. నాన్న తర్వాత నాన్నలాంటివాడని అన్నయ్య కళ్యాణ్‌రామ్‌పై తన ప్రేమను చాటుకున్నాడు ఎన్టీయార్‌. ఇంకో అన్నయ్య జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని చెమర్చిన కళ్ళతో ఉద్వేగంగా మాట్లాడాడు ఈ కార్యక్రమంలో. అన్నయ్య జానకిరామ్‌ తమకు దూరమవకుండా ఉండి ఉంటే తాము ముగ్గురం జై, లవ, కుశల్లా ఈ ఆడియో విడుదల వేడుకలో కన్పించేవారిమని, ఆ అవకాశం దేవుడు తమకివ్వలేదని ఎన్టీయార్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ జీవితం తన తండ్రి ఇచ్చిన బహుమతి అని తండ్రి హరికృష్ణ గురించి చెప్పాడు ఎన్టీయార్‌. అందుకే ఆయన పుట్టినరోజుకు ఈ సినిమాని కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నాడు ఎన్టీఆర్‌. అభిమానుల కోసం భారీగా ఆడియో విడుదల ఫంక్షన్‌ చేద్దామనుకుని, కొన్ని కారణాలతో దాన్ని ప్రెస్‌మీట్‌ తరహాలో పరిమితం చేసేశారు. అభిమానుల కోసం త్వరలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తారు. ఈ నెల 10న ఆ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21న 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ALSO READ: బాలయ్య 102లో కొత్త హీరోయిన్