ENGLISH

కమల్‌హాసన్‌ పుత్రికోత్సాహం

26 August 2017-19:24 PM

కమల్‌హాసన్‌ వెండితెరపై విశ్వనటుడనిపించుకున్నాడు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో విజయాల్ని అందుకున్నారు. విజయాల్ని మించిన ప్రశంసలు అందుకున్నారు. ఏ సినిమా చేసినా తాను నటించిన మరో సినిమాతో పోలిక ఉండకూడదనే తత్వం కమల్‌హాసన్‌ది. సినిమా కోసం ఎంతకైనా తెగించడం కమల్‌హాసన్‌ ప్రత్యేకత. మరి అలాంటి కమల్‌హాసన్‌ నుంచి నటనే వారసత్వంగా సినీ రంగంలోకి వచ్చిన ఆయన కుమార్తెలు ఎలా ఉంటారు? కమల్‌హాసన్‌లానే మల్టీ టాలెంటెడ్‌ అని శృతిహాసన్‌ ఎప్పుడో నిరూపించేసుకుంది. ఇప్పుడు ఛాన్స్‌ అక్షరహాసన్‌ది. శృతిహాసన్‌ టాప్‌ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటించింది, నటిస్తూనే ఉంది. ఇంకో వైపున అక్షరహాసన్‌ ఇప్పుడిప్పుడే అవకాశాలు సంపాదించుకుంటోంది. 'వివేకం' సినిమాలో అక్షర నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తన కుమార్తెలిద్దరూ సినీ రంగంలో రాణించడం పట్ల కమల్‌హాసన్‌ హర్షం వ్యక్తం చేశాడు. సినీ రంగంలోకి రమ్మని తాను కోరలేదనీ, వారి నిర్ణయాల్ని వారికే వదిలేయడం వల్ల వారు ఖచ్చితమైన ఆలోచనలతో సినీ రంగాన్ని ఎంచుకుని అందులో రాణిస్తున్నారని కమల్‌ వివరించాడు. మల్టీ టాలెంటెడ్‌ అని ఎవరైనా తన కుమార్తెలను పొగిడితే ఆనందంగా ఉంటుందనీ అలా పేరు తెచ్చుకోవడానికి వారెంతో కష్టపడ్డారని కమల్‌ చెప్పాడు. సినీ రంగానికి సంబంధించినంతవరకు తాను తన కుమార్తెలకు ఎలాంటి సలహాలు ఇవ్వనని అన్నాడు కమల్‌హాసన్‌.

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్