చిత్రం: కింగ్ స్టన్
దర్శకత్వం: కమల్ ప్రకాశ్
కథ - రచన: కమల్ ప్రకాశ్
నటీనటులు: జీవీ. ప్రకాష్ కుమార్, దివ్య భారతి,చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్,ఆంటోని,అరుణాచలేశ్వరన్,రాజేష్ బాలచంద్రన్,
రామ్ నిశాంత్
నిర్మాతలు: జీ.వీ. ప్రకాష్ కుమార్, ఉమేష్ కెఆర్ బన్సాల్
సంగీతం: జీ.వీ. ప్రకాష్ కుమార్,
సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్
ఎడిటర్: సాన్ లోకేష్
బ్యానర్: జీ స్టూడియోస్, ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్
విడుదల తేదీ: 7 మార్చ్ 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరో గా నటించిన కింగ్ స్టన్ మంచి అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి నిర్మాత, సంగీత దర్శకుడు కూడా జీవీ ప్రకాషే. జీవీ ప్రకాష్ కెరియర్లో హీరోగా 25వ సినిమా కావడం గమనార్హం. ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. తన తమిళ సినిమాలను డబ్బింగ్ కూడా చేయలేదు. మొదటి సారి తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి కింగ్ స్టన్ రిలీజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాష్ కొద్ది కాలంలోనే మంచి మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. హీరో గా కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కింగ్ స్టన్ ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రకాష్ కి తెలుగులో హిట్ ఇచ్చిందా లేదా? తెలుగు ఆడియన్స్ ని మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
తూవట్టూర్ కోస్టల్ విలేజ్‌లో ప్రజలు చేపలు పడుతూ జీవితం వెళ్లదీస్తూ ఉంటారు. వీరి ప్రధాన వృత్తి చేపలు పట్టడమే. ఇదే ప్రాంతంలో 1982లో ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. స్టీఫెన్ బోస్(అజాగమ్ పెరుమాల్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి ఒక దగ్గర పాతి పెడతారు. తనని చంపారని కక్షతో ఆ ఆత్మ అందరిని వెంటాడుతుందని, ఊరిని వల్లకాడు చేస్తుందని గ్రామస్థులు భావించి ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు. తరువాత సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు శవాలై కొట్టుకొస్తుంటారు. ఇలా చాలా మంది మరణిస్తారు. దానికి కారణం స్టీఫెన్ ఆత్మ అని అందరూ అనుకుంటారు. స్టీఫెన్ వలనే ఈ హత్యలు జరుగుతున్నట్లు జనాన్ని నమ్మిస్తారు. ఆ తర్వాత ఊర్లో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఈ విషయాలు గూర్చి కథలు చెప్తుంటాడు కింగ్(జీవి ప్రకాష్) తాత మార్టిన్(ఈ కుమారవేల్). చిన్నప్పటినుంచి తన తాత చెప్పిన దెయ్యాల కథలని కింగ్ నమ్మడు. ఇక్కడ సముద్రంలో జరుగుతున్న మిస్టరీ మర్డర్స్ కారణంగా గ్రామస్థులు వేరే చోటుకి వెళ్ళిపోతారు. వారంతా థామస్ అయ్యా(సబుమాన్ అబ్దుసమద్) వద్ద పనిచేస్తుంటారు. సముద్రంపై చేపల వ్యాపారం చేసే థామస్ అంటే అందరికీ గురి, అయన చెప్పినట్లు అంతా చేస్తుంటారు. ఒక రోజు సముద్రం పై వేటకి వెళ్లిన కింగ్ గ్యాంగ్ లో ఓ కుర్రాడు నేవీ అధికారుల దాడిలో మరణిస్తాడు. ఆ కుర్రాడు చనిపోయే ముందు అసలు మనం ఏం పని చేస్తున్నామో? ఆ పెట్టేల్లో ఏముందో చూడండి అన్నా అని చెప్పి చనిపోతాడు. అప్పుడే తెలుస్తుంది కింగ్ గ్యాంగ్ కి తాము చేస్తోంది చేపల వ్యాపారం కాదు డ్రగ్స్ వ్యాపారం అని. ఇది తెలిసిన కింగ్ థామస్ ని ఎదిరిస్తాడు. తమ ఏరియాలో సముద్రం లో జరుగుతున్న మర్డర్స్ నిజం కాదని తాను వెళ్లి చేపలు పట్టుకొస్తానని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాడు కింగ్. సముద్రంలో శవాలు కొట్టుకు రావటానికి కారణమేంటి? సముద్రంలో కింగ్ ఏం చూసాడు? సముద్రం లో జరుగుతున్న బిజినెస్ ఏంటి? జాంబీలకు ఈ ఘటనలతో ఉన్న లింకేంటి? కింగ్ తాత సాల్మన్(చేతన్) కథేంటి? థామస్ చేస్తున్న వ్యాపారాలేంటి? కింగ్ తాతకి థామస్ కి ఉన్న సంబంధం ఏంటి? అమ్మాయిలు ఎనుదుకు మిస్ అవుతున్నారు? చివరికి ఏం జరిగింది? సముద్రం లో జరిగిన వాటిని కింగ్ బయట పెట్టాడా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
జీవీ ప్రకాష్ హీరోగా నిలదొక్కు కోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా కెరియర్లో సాలిడ్ హిట్ పడలేదు. అందుకే తానే హీరోగా, నిర్మాతగా మారి రెండు పడవల ప్రయాణం చేసాడు. ఎదో కొత్త కథ తీసుకున్నామని, చాలా కష్టపడ్డామని ప్రమోషన్స్ లో భారీ అంచనాలు పెంచేసాడు. హాలీవుడ్ లో సముద్రాన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చి ఉన్నాయి కానీ మన ఇండియన్ సినిమాలో ఈ జోనర్ తక్కువనే చెప్పాలి. 'కింగస్టన్' కోలీవుడ్ రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉన్నా, రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ 'దేవర' మూవీని జ్ఞప్తికి తెస్తోంది. ఇంచు మించుగా అదే స్టోరీ. బతుకు తెరువు కోసం సముద్రంలో దొంగతనానికి వెళ్ళటం, ఊరిలో ఒక కుర్రాడు చనిపోయాక నేవీ అధికారి ద్వారా అసలు తాము చేస్తున్న దొంగతనాలు ఏంటో తెలుసుకుని హీరో గ్యాంగ్ తామిక అలాంటి పనులు చేయమని చెప్పటం సేమ్ టూ సేమ్ ఇదే స్టోరీ. దేవర మూవీని తమిళం లో రీమేక్ చేసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూస్తుంటే.
కింగ్ స్టన్ మూవీతో జీవీ ప్రకాష్ ఒక కొత్త ప్రయోగం చేసాడు. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు జీవీ. సస్పెన్స్, థ్రిలర్, హర్రర్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. యాక్షన్ తో పాటు లవ్ స్టోరీ కూడా ఉండటం విశేషం. తాను ఎంచుకున్న కథని అంతే కన్విన్సింగ్‌గా చెప్పగలిగాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్ నుంచి సస్పెన్స్ ఉంటుంది. ఈ సస్పెన్స్ ఆడియెన్స్ చివరి వరకు ఎంగేజ్ చేయగలిగింది. సౌండ్ సిస్టం కూడా బాగా కుదిరింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు, ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తాయి. ఫస్టాఫ్ ల్యాగ్ గా ఉన్నా, సస్పెన్స్ థ్రిల్ ఎక్స్ పీరియెన్స్ తో పెద్ద లోటు అనిపించదు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్లు బాగున్నాయి. సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అయ్యి ప్రేక్షుకుడికి మరింత కిక్ నిచ్చింది. హర్రర్ ఎలిమెంట్లు, జాంబీలు, టోటల్ గా సెకండ్ హాఫ్ మంచి ఫీల్ ఇస్తాయి. సముద్రంలోకి హీరో టీమ్ వెళ్ళటంతో ఉత్కంఠ, భయం మొదలవుతాయి. ఇంత సీరియస్ టైంలో కూడా కొంచెం కామెడీ అద్దారు దర్శకుడు. క్లైమాక్స్ లో థ్రిల్ ఫీలింగ్ పీక్స్ లో ఉంటుంది. కథ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఎక్కువ అవటంతో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. విజువల్& సౌండింగ్ సూపర్. ఇవే ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తోంది. సముద్రంలో సీన్స్ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తాయి. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ లాగా సీక్వెల్స్ కూడా తీసే ఆలోచనలో ఉన్నాడు జీవి ప్రకాష్.
నటీ నటులు:
కింగ్ పాత్రలో జీవి ప్రకాష్ న్యాచురల్ గా నటించాడు. హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అవకుండా సెటిల్డ్ గా చేసాడు. కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. అయినా కానీ జీవీ తన నటనతో స్కోప్ పెంచుకున్నాడు. హీరో పాత్రతో పాటు మిగతా పాత్రలకి ఇంపార్టెన్స్ బాగానే ఇచ్చారు దర్శకుడు. ప్రతి పాత్రకి నటనకి స్కోప్ ఉంది. రోజ్‌గా దివ్య భారతి నటన పరవాలేదని పించింది. తాను భయపడుతూ అందరిని బయటపెట్టింది. ఇక థామస్ అయ్యగా సబుమాన్ అబ్దుసమద్ నెగటివ్ రోల్‌లో మెప్పించాడు. ఈ మూవీతో సౌత్ కి కొత్త విలన్ దొరికాడు. కింగ్ తాత సాల్మన్ గా చేతన్ నటన కథలో ప్రభావంతంగా ఉంది. చేతన్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంది. కనిపించింది కాసేపు అయినా నటనతో మెప్పించారు. బోస్‌గా అజగమ పేరుమాల్ పరవాలేదనిపించాడు. కింగ్ ఫ్రెండ్ గా రాజేష్ బాల చందిరన్, అరుణాచలేశ్వరన్, ఫైర్ కార్తీక్, కుమారవేల్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ :
దర్శకుడు కమల్ ప్రకాష్ ఎంచుకున్న కథ బాగుంది. రాసుకున్న విధానం కూడా బాగున్నా ప్రజెంటేషన్ లో కొంచెం జాగ్రత్త వహించాల్సింది. థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుడికి మంచి ట్రీట్ ఇవ్వటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడు చేసిన విభిన్న ప్రయత్నాన్ని మెచ్చుకోవలసిందే . గోకుల్ బినోయ్ కెమెరా వర్క్ సూపర్. సముద్రంలో విజువల్స్ బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్ కూడా బాగా న్యాచురల్ గా ఉంది. జీవి ప్రకాష్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా ప్రేక్షకుడిని బయపెట్టగలిగాడు. పాటలు తెలుగులో కుదరలేదు. ఎవరికీ అర్థం కాదు, బోర్ కొడుతుంది. సముద్రంలో వచ్చే సౌండింగ్ ఓ కొత్త అనుభూతిస్తుంది. మేకప్ టీమ్ హార్డ్ వర్క్ స్క్రిన్ పై కనిపిస్తోంది. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం శ్రద్ద తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ ఖర్చుకి వెనకాడకుండా కింగ్ స్టన్ ని నిర్మించాడు అని తెలుస్తోంది.
ప్లస్ పాయింట్స్
విజువల్ గ్రాఫిక్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కథ, కథనం
మైనస్ పాయింట్స్
తమిళ నేటివిటీ, నటీనటులు
ఫస్ట్ హాఫ్
స్లో నేరేషన్
క్లారిటీ మిస్సింగ్
ఫైనల్ వర్దిక్ట్: యాక్షన్ అడ్వెంచర్ 'కింగ్ స్టన్'