ENGLISH

బ‌న్నీకి దేవ‌ర‌ క‌థ చెప్ప‌లేదా?

24 September 2024-18:19 PM

అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాడు కొర‌టాల శివ‌. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ప్రీ లుక్ కూడా వ‌దిలారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగ‌లేదు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ తో 'దేవ‌ర‌' ప‌ట్టాలెక్కింది. అయితే 'దేవ‌ర‌' క‌థే... అప్ప‌ట్లో బ‌న్నీకి వినిపించార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ లో కూడా స‌ముద్రం, ప‌డ‌వ‌లూ... అలాంటి సెట‌ప్ క‌నిపించ‌డంతో 'దేవ‌ర‌' క‌థ‌, బ‌న్నీ క‌థ రెండూ ఒక‌టే అనుకొన్నారు. కానీ వీటిపై కొర‌టాల శివ క్లారిటీ ఇచ్చారు. బ‌న్నీ క‌థ వేర‌ని, 'దేవ‌ర‌' క‌థ ఎన్టీఆర్‌కి త‌ప్ప ఇంకెవ‌రికీ వినిపించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాంతో ఈ రూమ‌ర్ల‌కు చెక్ ప‌డిన‌ట్టే అనుకోవాలి.


ఆచార్య‌ ఫ్లాప్ కొర‌టాల‌ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత ట్రోలింగ్ జ‌రిగింది. ఆ ఒత్తిడి 'దేవ‌ర‌'పై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని భావించారంతా. కానీ 'ఆచార్య‌' ఎఫెక్ట్ త‌న‌పై లేద‌ని తేలిగ్గా తీసిప‌డేశారాయ‌న‌. 'ఆచార్య విడుద‌లైన 3 రోజుల త‌ర‌వాత 'దేవ‌ర‌'కు సంబంధించిన ప‌నులు మొద‌లెట్టేశాం. కాబ‌ట్టి 'ఆచార్య‌' ఫ్లాప్, త‌ద్వారా వ‌చ్చే ఒత్తిడి నాపై ప‌డ‌లేదు. కాక‌పోతే ఇంకాస్త జాగ్ర‌త్త ప‌డి సినిమా చేయాల‌ని అర్థ‌మైంది. 


ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ ఇచ్చిన బూస్ట‌ప్ అంతా ఇంతా కాదు. ఓ సోద‌రుడిలా న‌న్ను ప్రోత్స‌హించాడు. రెండో షెడ్యూల్ జ‌రుగుతున్న‌ప్పుడు.. ఈ క‌థ ని ఒకే సినిమాగా చెప్ప‌డం క‌ష్టం అనిపించింది. ఓ సినిమాని రెండు భాగాలుగా తీయ‌డం నాకు అస్సలు ఇష్టం లేదు. అంద‌రూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు, మ‌నం చేస్తే కొత్త‌గా ఏం ఉంటుంద‌నిపించింది. కాక‌పోతే.. రెండో భాగం తీయ‌క త‌ప్ప‌డం లేదు. ఈ క‌థ నేరేష‌న్ కే 4 గంట‌లు ప‌ట్టేది. ఇంట్ర‌వెల్ కే ఓ సినిమాకి ఉండాల్సిన ముగింపు వ‌చ్చేసింది. దాంతో రెండో భాగం తీయాల‌నుకొన్నాం. ఇది క‌ల‌సి క‌ట్టుగా తీసుకొన్న నిర్ణయం' అని చెప్పుకొచ్చారు.