ENGLISH

ఆస్కార్ వేదికపై లాపతా లేడీస్ సత్తా చాటేనా?

24 September 2024-15:46 PM

'లాపతా లేడీస్' ఈ మూవీ పేరు పెద్దగా ఎవరూ విని ఉండరు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పైనే మనద్రుష్టి, ఇలాంటి చిన్న సినిమాలపై ఎందుకుంటుంది. కానీ ఈ మూవీకి ఎక్కడ గుర్తింపు దక్కాలో అక్కడ దక్కింది. అవును ఫిలిం ఇండస్ట్రీలో అత్యుత్తమంగా భావించే ఆస్కార్ కి ఈ మూవీ నామినేట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2025 ఆస్కార్‌ కు భారత్ నుంచి లాపతా లేడీస్సి మూవీ అఫీషియల్ గా సెలక్ట్  కావటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనౌన్స్ చేసింది. 


స్టార్ కాస్టింగ్ లేదు, కేవలం కథని నమ్ముకుని తీసిన మూవీ 'లాపతా లేడీస్'. శ్రీవాస్తవ్ అనే చోటా యాక్టర్ ఈ మూవీలో హీరోగా  న‌టించాడు. రేసు గుర్రం సినిమాలో మద్దాలి గణేష్ గా నటించిన భోజ్‌పురి యాక్టర్ ర‌వి కిష‌న్ ఒక కీల‌క పాత్రలో నటించాడు. మిగతా వారంతా కొత్తవారే. ఫేమ్ లేని వారే. 2024  మార్చి 1న ఈ మూవీ రిలీజ్ అయ్యి, పాజిటీవ్ టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. ఆస్కార్ కి నామినేట్ అవటానికి ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెల్చుకుంది. అన్నిటికన్నా సుప్రీం కోర్టు 75 ఏళ్ళ ఉత్సవాల్లో ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శన ద్వారా అరుదైన గౌరవం పొందింది.  


2001లో ఒక చిన్న గ్రామానికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లికూతుర్లు తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పెళ్లయి అత్తవారింటికి వెళ్తుండగా ట్రైన్ లో పెళ్ళికూతురు మిస్ అవటం, ముసుగు వేసి ఉండటంతో తన భార్యే అనుకుని వేరే అమ్మాయిని భర్త తనతో తీసుకు వెళ్ళిపోవటం, ఇంటికి వెళ్ళి చూసి భార్య కాదని తెల్సి, పోలీసు కంప్లైంట్ ఇవ్వటం ఈ క్రమంలో ఏం జరిగింది, ఏంటనేది కథ. ఆలోచనాత్మకంగా తెరకెక్కించారు కిరణ్ రావు. కమర్షియల్ హంగులు లేని మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కచ్చితంగా ఆస్కార్ సాధించాలని పలువురు ఆశ పడుతున్నారు.