ENGLISH

'లక్ష్య' మూవీ రివ్యూ & రేటింగ్!

10 December 2021-14:30 PM

నటీనటులు: నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ తదితరులు
దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
సంగీత దర్శకుడు: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటింగ్: జునైద్ సిద్ధికి


రేటింగ్: 2.5/5

 

'వరుడు కావలెను' సినిమా నాగశౌర్యకి మంచి జోష్ ఇచ్చింది. ఛలో తర్వాత మరో డీసెంట్ హిట్ నాగశౌర్య ఖాతాలో పడింది. ఇదే జోష్ లో లక్ష్య సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు శౌర్య. విలు విద్య నేపధ్య, సిక్స్ ప్యాక్ బాడీ.. గుబురు గడ్డం.. ఇలా చాలా మేకోవర్ అయ్యాడు లక్ష్య కోసం. మరి శౌర్య ఇంత కొత్తగా సిద్ధమైన లక్ష్య..  ప్రేక్షకుడికి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది.. శౌర్య లక్ష్యం టార్గెట్ ని తాకిందా లేదా ? ఇంతకీ ఏమిటీ లక్ష్య కథ 


కథ:


పార్థు(నాగశౌర్య) విలువిద్య (ఆర్చరీ) ఆటగాడు. తన అరంగేట్రంలోనే నేషనల్ ఛాంపియన్‌ను చిత్తు చేస్తాడు. అయితే పార్థుకి ఒక వీక్ నెస్ వుంది. తన తాతయ్య (సచిన్ ఖేడ్కర్) ఎదురుగా ఉంటేనే ఆటలో రాణించగలడు. ఇలా ఉండగా పార్థు తాతయ్య కాలం చేస్తాడు. అక్కడ నుంచి పార్థు గురి తప్పుతుంది. పార్థుని రాహుల్ అనే  మాజీ ఛాంపియన్ మత్తుకి బానిస చేస్తాడు. డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయిన పార్థు డిస్ క్యాలిఫై అవుతాడు. తర్వాత ఏం జరిగింది ? పార్థు మళ్ళీ అర్చరీ ఛాంపియన్ అవుతాడా ? అసలు తాతయ్యతో పార్ధుకి వున్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిది ? అనేది మిగతా కథ.


విశ్లేషణ: 


కొత్త కథ కావాలి. పాయింట్ ఫ్రెష్ గా వుండాలి. ఇది వరకూ అలాంటి పాయింట్ రాకూడదు. ఇవన్నీ నిజమే.. అయితే కొత్త కథ చెప్పే ప్రయత్నంతో కొత్తగా వున్నాసరే  ప్రేక్షకుడు కనెక్ట్ కాని పాయింట్ మాత్రం చెప్పకూడదు. లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కూడా ఇదే పాయింట్ మిస్ అయ్యాడు. ఈ సినిమాకి కొత్త నేపధ్యం ఎంచుకున్నాడు. విలు విద్య నేపధ్యంలో టాలీవుడ్ లో ఇప్పటివరకూ సినిమా రాలేదు. అక్కడి వరకి బాగానే వుంది. అయితే ఒక తెలుగు సినిమా చూడ్డానికి టికెట్ కొనే ప్రేక్షకుల్లో ఎంతమందికి ఆర్చరీ గేమ్ గురించి తెలుసు ? అనే ప్రశ్న కూడా వేసుకోవాలి.


'సై' సినిమాలో రగ్బీ గేమ్ చూపించి రాజమౌళి హిట్టు కొట్టలేదా ? అప్పటివరకూ రగ్బీ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏం తెలుసు అనే ప్రశ్న వేయొచ్చు. కానీ 'సై' సినిమాలో రగ్బీని చూపించడానికి, ఆ ఆటని పరిచయం చేయడానికి రాజమౌళి ఎలాంటి ట్రిక్కు ప్లే చేశాడు ? ఎలాంటి డ్రామా అల్లుకున్నాడు ? పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ సృష్టించాడు ? అనే అంశాలపై లక్ష్య దర్శకుడు  కూడా ద్రుష్టి పెట్టుంటే ఈ అర్చరీ గేమ్ పై ప్రేక్షకుడి గురి కుదిరిపోయేది. కానీ లక్ష్యలో ఇలాంటి గ్రౌండ్ వర్క్ ఏమీ జరిగినట్లే కనిపించదు. ఆర్చరీని వివరించే ప్రయత్నం జరిగినా దాని చుట్టూ వున్న డ్రామా పండలేదు.  


సినిమా మొదలైనప్పటి నుంచి నిదానంగా సాగుతుంది. పార్థూకి ఆట‌తో ఉన్న అనుబంధం, తాత‌య్యపై ఉన్నప్రేమ, స్పోర్ట్స్ అకాడ‌మీలో జాయిన్ అవ్వడం.. ఇలా.. సీన్లు నిదానంగా సాగుతుంటాయి. ల‌వ్ స్టోరీలో కూడా ఫ్రెష్ నెస్ లేదు.  తాత‌య్య మ‌ర‌ణం తర్వాత కథపై  కొంచెం ఆసక్తి పెరుగుతుంది. పార్థు మ‌త్తుమందుకు బానిస అవ్వడం, తెలియ‌కుండా ట్రాప్ లో ప‌డిపోవ‌డం.. ఇవన్నీ ఇట్రస్ట్ క్రియేట్ చేస్తాయ.

 

అయితే ద్వితీయార్థంలో.. జ‌గ‌ప‌తిబాబు పాత్ర,  పార్థూ మ‌ళ్లీ మామూలు అవ్వడం, బాణాలు అందుకోలేని స్థాయి నుంచి ఎడ‌మ‌చేత్తో గురి చూసి కొట్టడం కొంచెం సినిమాటిక్ గా వుంటాయి. ఇదే సమయంలో తెరపై ఈ మొత్తం వ్యవహారం అంత ఆడియన్స్ ఊహాకు తగ్గట్టే సాగుతుంటుంది. పెద్దగా మలుపులు కనిపించవు. పాత్రల మధ్య ఘర్షణ లేకపోవడం కూడా ఈ సినిమాకి ప్రాధన మైనస్. పార్ధు పాత్రపై తప్పితే మిగతా పాత్రలపై దర్శకుడు పెద్దగా ద్రుష్టి పెట్టినట్లు కనిపించదు.


నటీనటులు : 


నాగ‌శౌర్య సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. ఎయిట్ ప్యాక్ బాడీలో  నాగశౌర్య కొత్తగా కనిపిస్తాడు. ఆ లుక్ కోసం త‌ను ప‌డిన క‌ష్టం క‌నిపిస్తుంది. ఎమోష‌న్ సీన్స్ బాగా నటించాడు. హీరోయిన్ కేతిక ఓకే. జ‌గ‌ప‌తిబాబు పాత్ర సినిమాటిక్ గా వుంటుంది. సచిన్ ఖేడ్కర్ కి మంచి పాత్ర దక్కింది. మిగతా నటులు పరిధి మేర నటించారు. 

 
టెక్నికల్ గా : 


పాటలకి స్కోప్ లేదు. నేపధ్య సంగీతం ఓకే. కెమరాపని తనం బావుంది. అయితే ఆర్చరీ నేపధ్యంలో వచ్చిన కొన్ని సీన్లు  నాసిరకంగా అనిపిస్తాయి. బహుశా గ్రాఫిక్స్ తేలిపోవడం ఒక కారణం కావచ్చు. ఎడిటర్ సినిమాని ఇంకా కొంచెం షార్ఫ్ చేసే ఛాన్స్ వుంది.  నిర్మాణ విలువలు ఓకే.  


ప్లస్ పాయింట్స్ : 


నాగశౌర్య
ఆర్చరీ నేపధ్యం 


మైనస్ పాయింట్స్ :


సాగాదీత
ఎమోషన్ పండకపోవడం 
బలమైన విలన్, పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : 'హిట్' టార్గెట్ 'మిస్'

ALSO READ: 'గమనం' మూవీ రివ్యూ & రేటింగ్!