ENGLISH

బాలీవుడ్‌కి వెళుతోన్న 'కాంచన'.!

29 April 2019-14:00 PM

డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా శిష్యుడిగా ఆయన తర్వాత స్థానాన్ని పదిలంగా ఆక్రమించిన రాఘవ లారెన్స్‌ గురువుగారి దారిలోనే పయనిస్తూ వచ్చాడు. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటిన తర్వాత డైరెక్షన్‌ ఫీల్డ్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు.

 

తెలుగు, తమిళ భాషల్లో హారర్‌ కామెడీ జోనర్‌తో లారెన్స్‌ తెరకెక్కించిన 'ముని' సిరీస్‌ మూవీస్‌ ఎంతగానో ఆదరణ దక్కించుకున్నాయి. దక్కించుకుంటూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా 'కాంచన 3' చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన లారెన్స్‌ రాఘవ ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. లారెన్స్‌ తెరకెక్కించిన 'ముని 2', తెలుగులో 'కాంచన' సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు. గత కొంత కాలంగా హిందీలో డైరెక్షన్‌ చేయాలని అనుకుంటున్నాడు లారెన్స్‌ రాఘవ. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. తనకు బాగా కలిసొచ్చిన హారర్‌ కామెడీ చిత్రంతోనే అక్కడ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. లారెన్స్‌, లక్ష్మీరాయ్‌ జంటగా తెరకెక్కిన 'కాంచన' సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి లారెన్స్‌ కేవలం దర్శకత్వం మాత్రమే వహిస్తున్నాడు.

 

హీరోగా అక్షయ్‌ కుమార్‌ హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తున్నారు. లేటెస్ట్‌గా లాంఛ్‌ అయిన ఈ సినిమా లారెన్స్‌కి హిందీలో ఏ స్థాయి పేరు తెచ్చి పెడుతుందో చూడాలిక. మరోవైపు తొలి సినిమాకే లారెన్స్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి హీరోతో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కడం విశేషం.