ENGLISH

'మంచి రోజులొచ్చాయి' రివ్యూ & రేటింగ్‌!

04 November 2021-13:18 PM

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాతలు: ఎస్ కె ఎన్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఉద్దవ్


రేటింగ్: 2.25/5


మారుతి సినిమా అన‌గానే.. న‌వ్వుకోవ‌డం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం క‌లుగుతుంటుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తిరోజూ పండ‌గేతో ఆ బ్రాండ్ వాల్యూ మ‌రింత పెరిగింది. ఓ వైపు గోపీచంద్ తో సినిమా చేస్తున్నా - దాన్ని ప‌క్క‌న పెట్టి, కొత్త‌వాళ్ల‌తో ఓ చిన్న సినిమా తీశాడు. అదే `మంచి రోజులొచ్చాయి`. ఓ పెద్ద మాస్ సినిమాకి బ్రేక్ ఇచ్చి, చిన్న సినిమా తీశాడంటే కంటెంట్‌లో ఏదో మంచి విష‌యం ఉంద‌నిపిస్తుంది. పైగా చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాడు. మ‌రి `మంచి రోజులు వ‌చ్చాయి`లో ఉన్న ఆ కంటెంట్ ఏంటి?  దానికి మారుతి ఇచ్చిన కామెడీ ట‌చ్ ఏమిటి?


* క‌థ‌


గుండు గోపాలం (అజ‌య్ ఘోష్‌) కి భ‌యాలెక్కువ‌. ఫ‌ర్ స‌పోజ్‌.. ప‌క్కింటోడు వ‌చ్చి `ఏంటి ఈరోజు బాగా డ‌ల్ గా క‌నిపిస్తున్నారు?` అని అంటే.. అప్పటి వ‌ర‌కూ ఆరోగ్యంగా ఉన్న‌వాడు కాస్త స‌డ‌న్ గా డ‌ల్ గా మారిపోతాడు. అది త‌న బ‌ల‌హీన‌త‌. ఆ బ‌ల‌హీన‌త‌ని ప‌ట్టుకుని మూర్తి, కోటేశ్వ‌ర‌రావు అనే ఇద్ద‌రు గోపాలాన్ని నానా ర‌కాలుగా ఆడుకుంటుంటుంటారు. అది వాళ్ల‌కు టైమ్ పాస్. కూతురు ప‌ద్దు (మెహ‌రీన్‌) విష‌యంలోనూ అలానే భ‌య‌పెట్టేస్తారు.


`నీ కూతురు ఎవ‌డినో ప్రేమించి ఉంటుంది. వాడుమోసం చేసి వెళ్లిపోతాడు. అప్పుడు నువ్వు గుండెపోటుతో పోతావ్‌` అంటూ ఒక‌టే న‌స‌. అది నిజ‌మే అనుకుని కూతురుని అనుక్ష‌ణం గ‌మ‌నిస్తుంటాడు. నిజంగానే ప‌ద్దు సంతూ (సంతోష్ శోభ‌న్‌) అనే అబ్బాయితో ప్రేమ‌లో ప‌డుతుంది. ప‌ద్దూకి తండ్రంటే చాలా ఇష్టం. గోపాలం కూడా కూతుర్ని గారాభంగా పెంచాడు. తండ్రి కోసం ఇష్టం లేక‌పోయినా పెళ్లి చూపుల‌కు సిద్ధ‌ప‌డుతుంది ప‌ద్దు. ఆ సంబంధాల‌న్నీ... సంతూ చెడ‌గొడుతుంటాడు. ప‌ద్దూని పెళ్లి చేసుకోవ‌డ‌మే కాదు.. గోపాలంలోని భ‌యాల్ని పోగొట్ట‌డం కూడా సంతూ త‌న బాధ్య‌త‌గా భావిస్తాడు. మ‌రి గోపాలం భ‌యాలు పోయాయా?  ప‌ద్దూని పెళ్లి చేసుకోగలిగాడా?  అనేదే మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లో హీరోకి మ‌తి మ‌రుపు. మ‌హానుభావుడులో అయితే... అతి శుభ్ర‌త‌. అదే బాబు బంగారంలో అయితే... జాలి గుణం. ఇలా ప్ర‌తీ సినిమాలోనూ హీరోకి ఓ బ‌ల‌హీన‌త ఆపాదించి, దాని చుట్టూ క‌థ‌ని అల్లాడు మారుతి. అవ‌న్నీ వ‌ర్క‌వుట్ అయ్యాయి. అయితే ఈసారి ఆ బ‌ల‌హీన‌త హీరోకి ఇవ్వ‌లేదు.హీరోయిన్ తండ్రికి ఇచ్చాడు. అదే.. కొత్త‌గా ఫీల‌య్యాడు మారుతి. భ‌య‌మే.. అన్నింటికంటే పెద్ద జ‌బ్బు అనే పాయింట్ ని తీసుకున్నాడు. నిజానికి చాలా మంచి పాయింట్. మారుతి స్టైల్ లో చెబితే బాగా న‌వ్వుకోవొచ్చు. మారుతి తొలి స‌న్నివేశాల్లో ఆ ప్ర‌య‌త్నం చేశాడు. గోవిందాన్ని ప‌క్కింటివాళ్లు ఆడుకోవ‌డం, దానికి గోవిందం ఇబ్బంది ప‌డ‌డం, కార్లో మెహ‌రీన్ -సంతోష్ ల సీన్లు.. ఇవ‌న్నీ క‌థ‌లోకి బాగా లాక్కెళ‌తాయి.


నిజానికి ఈ సినిమాలో హీరో సంతోష్ శోభ‌నా?  అజ‌య్ ఘోష్ నా అనిపిస్తుంది. ఎందుకంటే ప్ర‌తీ సీను అజ‌య్ ఘోష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మొద‌లువుతుంది. త‌న‌కే సీన్లుఎక్కువ ప‌డ్డాయి. వాటి మ‌ధ్య సంతోష్ మెహ‌రీన్ అతిథి పాత్ర‌ల్లా క‌నిపిస్తారంతే. క‌థ‌లో మారుతి చెప్పాల‌నుకున్న పాయింట్ మంచిదే కానీ.. దానికి బ‌లం లేకుండా పోయింది. అస్త‌మానూ.. ఒక‌టే పాయింట్ పై సీన్ న‌డిస్తే దాంట్లో ఎంత కామెడీ ట‌చ్ ఉన్నా, బోర్ కొట్టేస్తుంటుంది. పైగా ఇందులోని ప్ర‌తీ స‌న్నివేశం లెంగ్తీగా సాగుతూనే ఉంటుంది. పెళ్లి చూపుల ఎపిసోడ్స్ అయితే.. నెవ‌ర్ ఎండింగ్ ప్రోసెస్ లా న‌డుస్తుంటుంది.


ఈమ‌ధ్య‌లో హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఎటో కొట్టుకెళ్లిపోయింది. చివ‌ర్లో గోపాలం భ‌యాల్ని పోగొట్ట‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాలు ఇచ్చే స్పీచులు మ‌రీ నీర‌సం తెప్పిస్తాయి. అయితేఅప్ప‌డాల విజ‌య‌ల‌క్ష్మి ఎపిసోడ్ మాత్రం హిలేరియ‌స్ గా న‌డిచింది. ఇలాంటి సీన్లు అక్క‌డ‌క్క‌డ ప‌డ్డాయి గానీ... ఆ డోస్ ఏమాత్రం స‌రిపోలేదు. క‌రోనా కాలాన్ని మ‌ళ్లీ క‌ళ్ల ముందుకు తీసుకొచ్చాడు మారుతి. నిజానికి అక్క‌డ లాక్ డౌన్, వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ పై బోలెడంత కామెడీ, సెటైర్లు వేసుకోవొచ్చు. కానీ.. దాని వైపు మారుతి ఆలోచించ‌లేదు. త‌న మార్క్ కామెడీ మిస్ అవ్వ‌డం, క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుని ప‌ట్టుకుని మెయిన్ హీరోగా మార్చేయ‌డం ఈసినిమాలోని ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌లుగా మారిపోయాయి.


* న‌టీన‌టులు


సంతోష్ శోభ‌న్ ని ప‌క్క‌న పెడితే ఇది అజ‌య్ ఘోష్ సినిమా. త‌నే క‌థ‌లో హీరో. ఇంత పెద్ద పాత్ర ఇక ముందు ప‌డ‌దేమో..?  గోపాలంగా అజ‌య్ ప‌ర్‌ఫెక్ట్‌. త‌న ఎమోష‌న్స్‌ని బాగా చూపించాడు. అయితే అజ‌య్‌ని అంత సేపు చూస్తారా? అనేది పెద్ద సందేహం. ఇదే పాత్ర‌లో రావు ర‌మేష్ లాంటి న‌టుడైతే.. ఇంకాస్త మైలేజీ వ‌చ్చేది.


సంతోష్ శోభ‌న్ ని స్కేలు చాలా తక్కువ‌. త‌ను ఓ పాత్ర అంతే. డాన్సులు మాత్రం బాగా చేశాడు.మెహ‌రీన్ కీ అంత స్కోప్‌లేదు. త‌ను చాలా డీ గ్లామ‌ర్ గా క‌నిపించింది. ఈమ‌ధ్య బాగా స‌న్న‌బ‌డింది క‌దా. ఆ ఎఫెక్ట్ చాలా ప‌డింది. మూర్తి, కోటిల‌కు స్క్రీన్ టైమింగ్ చాలా ఎక్కువ ఇచ్చారు. వాళ్లంత‌గా పాపుల‌ర్ ఆర్టిస్టులు కారు. అదో మైన‌స్‌. వెన్నెల కిషోర్, సుద‌ర్శ‌న్‌, ప్ర‌వీణ్ వీళ్లంతా త‌మ‌కు అల‌వాటైన పాత్ర‌లు చేసుకుంటూ వెళ్లిపోయారు.


* సాంకేతిక వ‌ర్గం


మారుతి క‌థ లో బ‌లం లేదు. స‌న్నివేశాలు స‌రిగా పండ‌లేదు. ఒక‌ట్రెండు ట్రాకులు న‌వ్విస్తాయంతే. మిగిలివ‌న్నీ న‌స పెడ‌తాయి. అనూప్ పాట‌ల్లో రెండు బాగున్నాయి. ఒక‌ట్రెండు లొకేష‌న్ల మ‌ధ్య తీసేసిన సినిమా ఇది. కాబ‌ట్టి సినిమా అంతా అక్క‌డ‌క్క‌డ తిరుగుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. యూవీ చాలా త‌క్కువ‌లో సినిమా తీయాల‌ని ఫిక్స‌యిన‌ట్టుంది. అందుకే ఈ క‌థ ఎంచుకుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌

కొన్ని కామెడీ సీన్లు


* మైన‌స్ పాయింట్స్‌


బ‌ల‌హీన‌మైన క‌థ‌, క‌థ‌నాలు
లెంగ్తీ సీన్లు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిందే

ALSO READ: 'జై భీమ్' మూవీ రివ్యూ & రేటింగ్!