ENGLISH

ఫుల్లుగా పాడేసుకోమంటున్నాడండోయ్‌

13 April 2017-15:33 PM

తన పాటని ఎవరైనా పాడుకోవచ్చనీ, ఎంత ఎక్కువగా తన పాటని ఇతరులు పాడితే ఆ పాటకి, తద్వారా తనకు అంత మంచి పేరు వస్తుందని చెప్పాడు యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జే మేయర్‌. తన సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించడమే కాకుండా, అందులో విలక్షణతను చూపించే మిక్కీ జే మేయర్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా తన పాటల్ని ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడరాదని అనడంపై స్పందించాడు. 'నా వరకూ నా పాటలు ఎవరు పాడినా అభ్యంతరం లేదు' అని స్పష్టం చేశాడాయన. అలాగని ఇళయరాజా తీరుని ఖండించలేదు కూడా. పాటకు సంబంధించి సమగ్రమైన చట్టాలు లేనందున దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని చెబుతూ సరైన చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయం చెప్పడానికి వీలుంటుందని హుందాగా స్పందించాడు. 'మిస్టర్‌' సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, తన సినీ సంగీత ప్రయాణం సాఫీగా సాగుతోందని అన్నాడు. ఆ మధ్య త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేసిన 'అఆ' సినిమాతో ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి స్టార్‌డమ్‌ పెరిగింది. అయినప్పటికీ కూడా ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకోకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. దర్శకుల్లో శ్రీకాంత్‌ అడ్డాల, సంగీత దర్శకుల్లో ఎ.ఆర్‌.రెహమాన్‌ అంటే ఇష్టమట మిక్కీ జే మేయర్‌కి. 'మహానటి' సినిమాకి సంగీతం అందించే అవకాశం రావడం తన అదృష్టమని అంటున్నాడీ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 

ALSO READ: వైఎస్ఆర్సీపీ ఎంపీల పై పవన్ ట్వీట్లు